నేటి నుంచి ‘మెడికల్’ తరగతులు

26 Sep, 2016 00:41 IST|Sakshi
నేటి నుంచి ‘మెడికల్’ తరగతులు

* మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు దక్కిన విద్యార్థులు హాజరు
* నేడు రెండో విడత వెబ్ కౌన్సెలింగ్

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2016-17 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ తొలి ఏడాది తరగతులు సోమవారం ప్రారంభం కానున్నాయి. తొలివిడత కౌన్సెలింగ్‌లో ఎంపికైన వారికి కాలేజీల వారీగా సీట్లు కేటాయించిన అధికారులు తరగతుల ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది కొత్తగా ప్రారంభం కానున్న మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనూ తరగతులు ప్రారంభం కానున్నాయని అధికారులు చెబుతున్నారు. 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేటులోని కన్వీనర్ కోటాలో ఉన్న 2,075 ఎంబీబీఎస్ సీట్లకు, అలాగే 12 డెంటల్ కాలేజీల్లోని 606 సీట్లను (స్పోర్ట్స్, ఎన్‌సీసీ, మిలటరీ కోటా మినహాయించి) విద్యార్థులకు కేటాయించారు.

వీటిల్లో 70 ఎంబీబీఎస్, 200 బీడీఎస్ సీట్లల్లో విద్యార్థులు చేరనందున మిగిలాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వాటికి రెండో విడత వెబ్‌కౌన్సెలింగ్ సోమవారం నిర్వహించి, 27న సీట్ల కేటాయింపు చేస్తామన్నారు. కాగా, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే. వాటిల్లో అన్ని ఎంబీబీఎస్ సీట్లు భర్తీ కాగా.. 92 బీడీఎస్ సీట్లు మిగిలినట్లు కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెలాఖరులోగా వైద్య అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు