సవరణ బిల్లు తీసుకురండి

29 Jun, 2016 03:34 IST|Sakshi
సవరణ బిల్లు తీసుకురండి

హైకోర్టు విభజనపై కేంద్రానికి టీఆర్‌ఎస్ ఎంపీల డిమాండ్
* ఏపీ న్యాయమూర్తులను తెలంగాణకు పంపారు
* సమస్య పరిష్కరించకుంటే పార్లమెంటులో ఆందోళన తప్పదు
* కేంద్ర మంత్రులతో భేటీ.. వివాదాన్ని పరిష్కరించాలని విన్నపం

సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు విభజనపై కేంద్రం సవరణ బిల్లు తేవాలని టీఆర్‌ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఎక్కడ పనిచేస్తున్న న్యాయాధికారులు అక్కడే ఉండాలంటూ అపాయింటెడ్ డే కంటే రెండ్రోజుల ముందు డీవోపీటీ ఇచ్చిన ఉత్తర్వులను కాదని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ న్యాయాధికారుల కేటాయింపులు ఎలా చేస్తారని ప్రశ్నించారు.

మంగళవారం టీఆర్‌ఎస్ ఎంపీలు కె.కేశవరావు, ఎ.పి.జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, సీతారాంనాయక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితర ఎంపీలంతా తెలంగాణ న్యాయవాదులతో వెళ్లి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, డీవోపీటీ మంత్రి జితేంద్రసింగ్, న్యాయమంత్రి సదానందగౌడలను కలిశారు. తెలంగాణలో జరుగుతున్న ఆందోళనలను వివరించారు. తక్షణం హైకోర్టు విభజన జరగాలని, న్యాయాధికారుల కేటాయింపులపై జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించాలని కోరారు.

అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తొలుత కె.కేశవరావు మాట్లాడుతూ.. ‘‘సబార్డినేట్ జ్యుడీషియరీ సర్వీసులకు సంబంధించి ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం చెప్పిందేమిటంటే... ఒక కమిటీ వేసి విభజన జరపాలని చెప్పింది. దాన్నే ప్రస్తావిస్తూనే అపాయింటెడ్ డే కంటే రెండ్రోజుల ముందు మార్గదర్శకాలు వెలువడ్డాయి. కేంద్రం తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఏ రాష్ట్రంలో పనిచేసే న్యాయాధికారులు ఆ రాష్ట్రంలోనే పని చేయాలని చెప్పారు.

అయినా న్యాయాధికారుల కేటాయింపులపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒక ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఆంధ్ర న్యాయమూర్తులను తెలంగాణ పోస్టుల్లో బదిలీ చేసి పంపారు. ఆప్షన్ ఇవ్వొచ్చన్న సాకుతో ఇలా చేశారు. ముందుగా స్వస్థలం.. తర్వాత ఆప్షన్‌ను ప్రాతిపదికగా తీసుకోవాలి. మీ ఖాళీల కంటే మీరు ఎక్కువగా ఉన్నప్పుడు.. సర్దుబాటు కానప్పుడు ఇక్కడ సర్దుబాటు చేయొచ్చు. కానీ అలా చేయకుండా తెలంగాణలో నింపేశారు.

దీంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇక్కడ న్యాయాధికారులుగా నియమితులైన వారు చివరకు హైకోర్టు న్యాయమూర్తులవుతారు. అంటే మరో ముఫ్పై ఏళ్ల వరకు తెలంగాణ హైకోర్టులో కూడా ఏపీ న్యాయమూర్తులే ఉంటారు. తెలంగాణ హైకోర్టులో తెలంగాణ న్యాయమూర్తులు ఉండడానికి వీలు లేదన్న రీతిలో వ్యవహరిస్తున్నారు’’ అని అన్నారు. ఈ అన్యాయంపై నిరసన వ్యక్తం చేసిన న్యాయాధికారులను సస్పెండ్ చేశారని, ఇది దేశంలోనే మొదటిసారని పేర్కొన్నారు. ఈ పరిణామాలన్నింటినీ మంత్రులకు వివరించామని, వారికి మొత్తం విషయం అర్థమైందని పేర్కొన్నారు. న్యాయమంత్రి అన్యాయం జరిగిన మాట వాస్తవమే అన్నారని, తమతో ఏకీభవించినట్టుగా కనిపించిందని చెప్పారు.
 
న్యాయవాదులను రోడ్డెక్కిస్తున్నారు: ఎంపీ జితేందర్‌రెడ్డి
మంచిగా విడిపోయాం. మనుషులుగా కలిసి ఉందాం. అనవసరంగా గిల్లికజ్జాలు పెట్టుకుంటూ, మనోభావాలు రెచ్చగొడుతూ న్యాయవాదులను రోడ్డెక్కిస్తున్నారు. మాకు రావాల్సిన నీళ్లను అడ్డుకున్నారు. మా నియామకాలను అడ్డుకుంటున్నారు. ఏపీ అనవసరంగా లేనిపోని గొడవలు చేస్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రులకు వివరించాం. మా హైకోర్టును మాకు అప్పగించాలని, న్యాయాధికారులను విభజించాలని కోరాం.
 
రిజిస్ట్రార్ జనరల్ ఎలా నిర్ణయం తీసుకుంటారు: ఎంపీ వినోద్‌కుమార్
న్యాయాధికారులు తమ సంఘం ద్వారా హై కోర్టు చీఫ్ జస్టిస్‌కు విన్నవించుకున్నారు. చీఫ్ జస్టిస్ నాయకత్వాన కమిటీ వేశారు. ఆ కమిటీలో తేలలేదు. ఏపీలో పుట్టి అక్కడ ప్రాక్టీస్ చేసి న్యాయమూర్తులుగా పనిచేస్తున్న వారిని తెలంగాణకు కేటాయించడం సరికాదని ఆ కమిటీ అభిప్రాయపడ్డట్టు అర్థమవుతోంది.

దీంతో చీఫ్ జస్టిస్ దీన్ని ఫుల్ కోర్టుకు రిఫర్ చేశారు. అక్కడ తెలంగాణ న్యాయమూర్తులు ముగ్గురు ఉంటే ఏపీకి చెందినవారు 18 మంది ఉన్నారు. వారంతా తెలంగాణ న్యాయాధికారుల కేటాయింపులపై ముందుకెళ్లారు. దీన్ని తప్పుపడుతూ న్యాయాధికారులు నిరసన తెలియజేస్తే చీఫ్ జస్టిస్ రిజిస్ట్రార్ జనరల్ ద్వారా సస్పెండ్ చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ కేటాయింపులపై నిర్ణయం ఎందు కు తీసుకున్నారో స్పష్టత ఇవ్వాలి. మిమ్మల్ని ఎవరు గైడ్‌లైన్స్ ఫ్రేమ్ చేయాలని చెప్పారు? విభజన చట్టంలో స్పష్టంగా ఉంది.

కేంద్రం ఒక కమిటీ వేసి మార్గదర్శకాలు రూపొంది స్తుందని, అప్పుడు విభజన జరగాలని చెప్పిం ది. కానీ మీరు సొంతంగా ఎలా రూపొందిం చారు? ఏపీ విభజన చట్టం సెక్షన్ 31 సబ్‌క్లాజ్‌లో రెండేళ్లలో రాష్ట్రపతి హైకోర్టుపై నోటిఫై చేస్తారని చెప్పి ఉంటే అయిపోయేది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం సరికాదు. మోదీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ సబ్ క్లాజ్ చేర్చండి. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. లేదంటే పార్లమెంటులో మా నిరసన తెలుపుతాం.
 
నేడు హైకోర్టు బంద్‌కు పిలుపు
టీఆర్‌ఎస్ ఎంపీల విలేకరుల సమావేశానికి ముందు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గండ్ర మోహన్ రావు, అడ్వొకేట్ జేఏసీ కన్వీనర్ రాజేందర్‌రెడ్డి, జయాకర్ తదితరులు మాట్లాడారు. న్యాయవాదుల అరెస్టులు, న్యాయాధికారుల సస్పెన్షన్‌కు నిరసనగా బుధవారం హైకోర్టు బంద్‌కు పిలుపునిస్తున్నట్టు తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని బదిలీ చేయాలని కేంద్రానికి విన్నవించినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు