నాడు పూటకూళ్ల ఇళ్లు.. నేడు ఇంటర్నెట్టే వంటిల్లు!

15 Aug, 2016 01:39 IST|Sakshi
నాడు పూటకూళ్ల ఇళ్లు.. నేడు ఇంటర్నెట్టే వంటిల్లు!

ఒక్క క్లిక్‌తో ఇంటికే కోరుకున్న ఆహారం
ఇప్పుడంటే కాలు బయటపెడితే వీధికో హోటల్.. ఆ కాలు కూడా బయటపెట్టనివారికి ఎన్నో సైట్లు.. యాప్‌లు.. ఒక్క క్లిక్‌తో కోరుకున్న ఫుడ్డు రెక్కలు కట్టుకొని మరీ ఇంటికి వచ్చేస్తోంది..! ఆహార వ్యాపారం మూడు పువ్వులు.. ముప్పయ్యారు కాయల్లా విస్తరించింది. ఇది ఇప్పుడు. మరి స్వాతంత్య్రం సిద్ధించే నాటికి పరిస్థితి ఎలా ఉండేది? ఆ రోజుల్లో భోజనం ఏమాత్రం వ్యాపారం కాదు. మానవతా దృక్పథంతో చేసే ఓ కార్యక్రమం. ఆ రోజుల్లో చదువుకోవడానికి వెళ్లే వారు.. ఓ సుబ్బమ్మ, ఓ రమణమ్మ, ఓ వెంకమ్మ.. పేరు ఏదైనా వారి ఇళ్లలో పూటకూళ్లు తింటూ చదువుకునేవారు. మహాత్మాగాంధీ కూడా పోర్‌బందర్ విడిచి వెళ్లినపుడు ఇలా పూటకూళ్ల ఇళ్లలో తిన్నవారే.

ఎందరో తమ సొంత డబ్బులతో అన్నదానం చేసి ఔదార్యం చాటుకునేవారు. పూటకూళ్లు పెట్టేవారు. విస్తరేసి.. అంబలి, సంకటి, జొన్న రొట్టెలు, గోంగూర పచ్చడి, ఎర్రకారం, గడ్డ పెరుగుతో కొసరి కొసరి వడ్డించే వారట. తిండి తిన్న వారు జేబులో ఉన్న అణానో, పైసానో ఇచ్చి వెళ్లేవారు. అదీ లేని వారు ‘అన్నదాతా.. సుఖీభవా’ అంటూ ఆశీర్వదించిపోయే వారు. నాడు డబ్బులివ్వలేదని నేటిలా పిండి రుబ్బించడమో.. పోలీసులకు పట్టించడమో చేసే వారు కాదు. ఇప్పుడా ఆప్యాయత లేదు.. విస్తరాకు భోజన మూ లేదు! అయితే తిరుపతి నగరంలో మాత్రం పూటకూళ్ల ఇళ్లు ఇప్పటికీ ఉండటం విశేషం. ఆకట్టుకునే పేర్లతో మెస్‌లు, హోటళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.

గోంగూర, వంకాయ, వంటిల్లు, అరిటాకు, తాలింపు, సొంతిల్లు, చట్నీస్, మిస్టర్ ఇడ్లీ, దస్ వెరైటీస్ దోశ, అప్పడం, తృప్తి, సంతృప్తి.. తదితర పేర్లతో వెలసిన హోటళ్లు వెజ్జూ.. నాన్ వెజ్జూలో సవాలక్ష రకాల ఐటమ్స్‌తో వంటకాలు వండి వారుస్తున్నాయి. ‘ఆన్‌లైన్‌లో భోజనం’ కూడా హల్‌చల్ చేస్తోంది. కోరుకుంది తెచ్చేందుకు స్విగ్గీ, ఫుడ్‌పాండ, జొమాటో.. తదితర సైట్లతోపాటు ప్రత్యేక యాప్‌లు పుట్టుకొచ్చాయి.

మరిన్ని వార్తలు