నేడు ఎంసెట్, టెట్ షెడ్యూల్ ఖరారు!

2 May, 2016 04:17 IST|Sakshi

కడియం శ్రీహరి నేతృత్వంలో జరిగే సమీక్షలో నిర్ణయం

 సాక్షి, హైదరాబాద్: ఇటీవల వాయిదా వేసిన ఎంసెట్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) తేదీలను విద్యా శాఖ సోమవారం అధికారికంగా ఖరారు చేయనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వద్ద జరిగే సమీక్ష సమావేశంలో ఈ పరీక్షల తేదీలను నిర్ణయించనున్నారు. విద్యా సంస్థల్లో పోలీసు తనిఖీల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు విద్యా సంస్థలు చేపట్టిన బంద్ నేపథ ్యంలో మే 1న జరగాల్సిన టెట్, 2న జరగాల్సిన ఎంసెట్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ఈ నెల 20లోగా ఈ రెండు పరీక్షలను ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందులో భాగంగా ఆయా శాఖలు పరీక్షల నిర్వహణకు వివిధ తేదీలతో సిద్ధమయ్యాయి. సోమవారం చర్చించి ఆ తేదీలను కడియం శ్రీహరి ప్రకటించనున్నారు. ఎంసెట్‌ను ఈ నెల 15న నిర్వహించే అవకాశం ఉంది. అంతకంటే ముందుగానే నిర్వహించే వీలుంటే 13వ తేదీనే ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక టెట్‌ను ఈ నెల 14న లేదా 21-22 తేదీల్లో నిర్వహించేందుకు ఖరారు చేసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు