నృత్యమే ‘సత్య’మ్...

28 Apr, 2015 23:51 IST|Sakshi
నృత్యమే ‘సత్య’మ్...

నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవం
 

కొత్త సినిమాకు రిలీజ్ కన్నా పెద్ద పండుగ ఉందా? అంటే కాస్తంత సినీ జ్ఞానం ఉన్న ఎవరైనా ఠక్కున చెప్పే సమాధానం ఆడియో రిలీజ్. ఈ వేడుకలను భారీ సభల స్థాయికి తీసుకెళ్లి... అసలు సినిమా కన్నా కొసరుకే పెద్ద సంరంభంగా మార్చేశాయి. దాదాపు ప్రతి ఆడియో విడుదల వేడుకకీ  హైదరాబాద్ వేదిక ఎలాగో... 90శాతం ఫంక్షన్లలో కనిపించే ఏకైక నృత్య బృందం సత్యా డ్యాన్స్ ట్రూప్. టెన్త్‌క్లాస్ పూర్తి చేయడానికి తంటాలు  పడ్డ ఓ భీమవరం బుల్లోడు సృష్టించిన ఈ గ్రూప్... సినిమా వేడుకల్లో నృత్యాలు మొదలు టీవీ
 రియాలిటీ షోస్ దాకా అలుపెరగని జైత్రయాత్ర కొనసాగిస్తోంది.
 - సాక్షి, లైఫ్‌స్టైల్‌ప్రతినిధి
 
‘మాది భీమవరం గురూగారూ. డ్యాన్స్ పిచ్చికీ.. చదువుకీ లంకె కుదరక టెన్త్‌తోనే ఆపేశా. ఇంట్లో వాళ్లు చదువుకోమని వినుకొండలోని అక్కయ్య ఇంటికి పంపిస్తే... డ్యాన్స్ పిచ్చితో ముందు విజయవాడ వెళ్లా. ఆ తర్వాత ఈ సిటీకి వచ్చేశా. డ్యాన్సర్‌గా నా కెరీర్ 1998లో స్టార్ట్ అయింది’ అని చెప్పాడు డ్యాన్స్ మాస్టర్ సత్య అలియాస్ టి.సత్యనారాయణ. ఓ టీమ్‌ని విజయపథంలో నిలిపిన ఈ సక్సెస్ జర్నీ సత్య మాటల్లోనే...

‘ఫ్రెండ్స్‌తో కలిసి ఇందిరానగర్‌లోని ఇరుకు గదిలో ఉండేవాడిని. సీనియర్ కొరియోగ్రాఫర్ ముక్కురాజు మాస్టర్ దగ్గర ప్రాక్టీస్ చేశాను. రాకేష్ మాస్టర్ క్లాసెస్ తీసుకునేవారు. సుచిత్రా మాస్టర్ వంటి వారి గెడైన్స్ మంచి డ్యాన్సర్‌ని చేసింది. అప్పట్లో ఇక్కడ తమిళ డ్యాన్సర్లదే హవా. దీంతో మాకు ఒక పట్టాన అవకాశాలు రాలేదు. అతి కష్టం మీద డ్యాన్సర్‌గా కార్డు మాత్రం దొరికింది.
 
స్మాల్ స్టెప్స్ టు బిగ్ ఈవెంట్స్..
 
అప్పుడంతా మద్రాస్ వాళ్లదే డామినేషన్. తెలుగు డ్యాన్సర్లకు ఖాళీ టైమ్ బాగానే ఉండేది. అలా ఖాళీగా ఉన్న మరికొందరిని కలుపుకుని డ్యాన్స్ ట్రూప్ తయారు చేశా. తక్కువ మొత్తానికి కాలేజీ, స్కూల్స్‌లో చిన్న చిన్న ఈవెంట్స్ చేసేవాళ్లం. తలా రూ.100, 200 వచ్చినా చాలనుకునేంత పరిస్థితి. సినిమాల సంగతెలా ఉన్నా ఈవెంట్స్‌కి మంచి ఫ్యూచర్ ఉంటుందని అనిపించింది. వాటి మీదే బాగా కాన్సన్‌ట్రేట్ చేశా. ఈవెంట్స్ బాగా పెరగడం మొదలుపెట్టాయి. అదే సమయంలో డ్యాన్స్ షోస్‌కి రిహార్సల్స్‌గా ఉపకరిస్తుందని శ్రీనగర్ కాలనీలో డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్ పెట్టాను. ఆడియో రిలీజ్‌లు పెద్ద స్థాయి ఈవెంట్స్‌గా మారడం అనేది 2007-2008లో మొదలైంది. అప్పటికే ఈ తరహా వేడుకల విషయంలో అనుభవం బాగా ఉండడం ఉపకరించింది. పూర్తి స్థాయి టీమ్‌తో వెళ్లి ఇచ్చే పెర్ఫార్మెన్స్‌లు సూపర్‌హిట్ కావడంతో ఆడియో రిలీజ్ వేడుకల ఛాన్స్‌లు బాగా వచ్చాయి. ఢీ వంటి టీవీ రియాలిటీ షోస్ కూడా మంచి పేరు తెచ్చాయి. ఢీ డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేసిన ఏకైక తెలుగు డ్యాన్స్ మాస్టర్‌ని నేనే. మిగిలిన వాళ్లంతా వందల సినిమాలకు పనిచేసిన సీనియర్లు. నేను భలేదొంగలు సినిమాకి మాత్రమే డ్యాన్స్ మాస్టర్‌గా చేశాను. 100 సంవత్సరాల సినిమా వేడుకల కోసం చెన్నై వె ళ్లిన ఏకైక తెలుగు డ్యాన్స్ మాస్టర్ నేనే. దాదాపు 50 మంది హీరో, హీరోయిన్స్ నా సారథ్యంలో అక్కడ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన అనుభవం మర్చిపోలేనిది.
 
ఆడియో వేడుక...  ఆషామాషీ కాదు...
 
సినిమాలో ఒక సాంగ్‌కి స్టెప్స్ డిజైన్ చేసి... కొరియోగ్రఫీకి సుమారు వారం రోజులు పడుతుంది. అలాంటిది ఒక్క ఆడియో రిలీజ్‌కి ఒకటి రెండు రోజులు... కొన్నిసార్లయితే ఒక్క పూట మాత్రమే మాకు టైమ్ దొరుకుతుంది. దీంతో ఒక్కరోజులోనే 6సాంగ్స్ కంపోజ్ చేయాలి. అన్ని పాటలనూ ఒక్క రోజులోనే విని... ప్రత్యక్షంగా ప్రదర్శించేయాలి. పోనీ పాల్గొనేది ఏమైనా చిన్న ప్రోగ్రామా? అంటే కాదు. పెద్ద పెద్ద సినిమా ప్రముఖులు, వేలాదిగా అభిమానులు... హాజరవుతారు. ఆడియోకుతగ్గ డ్యాన్స్‌లు లేకపోతే రక్తికట్టదు. అది సినిమా క్రేజ్‌ను దెబ్బతీసే ప్రమాదమూ ఉంది. మొదటి నుంచీ ఈవెంట్స్ మీదే ఎక్కువ కాన్సన్‌ట్రేట్ చేయడం... ఈ ఒత్తిడిని తట్టుకోవడంలో నాకు హెల్ప్ అయింది. అందుకే  ఆడియో ఆల్బమ్స్ రిలీజ్‌లలో దాదాపు 80శాతం నేనే చేశాను.

సినిమా కన్నా కూడా లైవ్ పెర్ఫార్మెన్స్‌లోనే కొరియోగ్రఫీ బాగుంది అనే స్థాయిలో చేయగలిగాం. ఈవెంట్స్ సమయంలోనే దేవిశ్రీప్రసాద్ చూసి...అప్పటిదాకా ఆయన తమిళ డ్యాన్సర్లతో చేసే ఈవెంట్స్, షోస్ అన్నీ మాకు ఇచ్చారు. అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఆయన చేసిన షోస్ నాతోనే. ఇప్పుడు మా టీమ్‌లో దాదాపు 40 మంది ఉంటారు. వీరిలో అత్యధికులు ఫుల్‌టైమ్ ఎంప్లాయీస్. గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్‌కి చేసిన నృత్యానికి బాగా పేరొచ్చింది. ఇటీవల ఉత్తమ విలన్ ఆడియో రిలీజ్ కూడా మంచి పేరు తెచ్చింది.  దాదాపు 10 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాం. ఒక టీవీ చానెల్ కోసం స్టైల్ అనే రియాలిటీ షోని విభిన్నంగా డిజైన్ చేశా.  దాదాపు 60మందితో ఖతార్‌లో ప్రిలిమినరీస్,  దుబాయ్‌లో ఫైనల్స్ చేశాం. మొత్తం15 మంది సింగర్స్, 20 మంది హీరోయిన్స్ ఇందులో ఉన్నారు. అమీర్‌పేటలో ప్రారంభించిన డిజోన్ డ్యాన్స్-ఫిట్‌నెస్ స్టూడియో ద్వారా మరింత మంది డ్యాన్స్ డ్రీమ్స్ నిజం చేయాలని అనుకుంటున్నాను. అంతేకాదు సినిమా ఆర్టిస్ట్‌ల కోసం ప్రత్యేకంగా రాత్రి 8 గంటల నుంచి క్లాసెస్ తీసుకుంటున్నాను.
 
 

>
మరిన్ని వార్తలు