నేడు నీతి ఆయోగ్ భేటీ

27 Jun, 2015 01:01 IST|Sakshi
నేడు నీతి ఆయోగ్ భేటీ

* హాజరయ్యేందుకు సీఎం కేసీఆర్ విముఖత
* ఢిల్లీ వెళ్లనున్న సీఎస్, ప్రణాళికశాఖ పీఎస్

సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో శనివారం జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల ఉప కమిటీ ఆఖరి సమావేశం కావటంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఉంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ రెండో వారంలోనే జరగాల్సిన ఈ సమావేశం వాయిదా పడింది. అప్పుడు ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధపడ్డ సీఎం కేసీఆర్ ఈసారి  గైర్హాజరుకానున్నారు.

ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బి.పి.ఆచార్య తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇప్పటికే ఢిల్లీలో రెండుసార్లు, భోపాల్‌లో ఒకసారి ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. వీటిలో భోపాల్ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ పథకాలకు నిధుల కేటాయింపు, వాటి అమలుపై కేంద్రప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి రావటం, అందుకు అనుగుణంగా ఒక నివేదిక తయారు చేసిన నేపథ్యంలో శనివారం నాటి భేటీలో చర్చలకు తావు లేదని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రాల అభిప్రాయాలను తూతూమంత్రంగా విని, ఆ తర్వాత తన అభిప్రాయాన్నే కేంద్రం బలవంతంగా రుద్దుతోందని ఆయన ఉన్నతాధికారులతో అన్నట్లు తెలిసింది.
 
జూలై 2న నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడి రాష్ట్ర పర్యటన
నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ అరవింద్ పనగారియా జూలై 2న తెలంగాణలో పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతిఆయోగ్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ కార్యక్రమ పనితీరును పరిశీలించేందుకు ఆయన హైదరాబాద్‌కు రానున్నారు. తన పర్యటనలో భాగంగా 2న ఉదయం ఆయన జిల్లాల్లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను, 3 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబును కలసి నీతి ఆయోగ్‌పై చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు