బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ దాకా డ్రగ్స్‌ హవా

15 Jul, 2017 09:38 IST|Sakshi
బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ దాకా డ్రగ్స్‌ హవా

టాలీవుడ్‌ను డ్రగ్స్‌ ‘మత్తు’ ఊపేస్తోంది. మాదక ద్రవ్యాల ఆరోపణలతో పలువురు సినీ ప్రముఖులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రముఖ హీరోలు, దర్శకుల పేర్లు బయటకు రావడం కలకలం సృష్టించింది. వాస్తవంగా, చాలా ఏళ్ల క్రితం నుంచే చిత్ర పరిశ్రమకు, డ్రగ్స్‌ మార్కెట్‌కు మధ్య సన్నిహిత సంబంధం ఉంది. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ దాకా ప్రతి చోటా ఇండస్ట్రీలో డ్రగ్స్‌ హవా నడుస్తోంది.

రంగుల తెరపై డ్రగ్స్‌ మరక!
మాదకద్రవ్యాల కేసుల్లో పలువురు సినీ ప్రముఖులు
బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కు పాకిన విష సంస్కృతి
వినియోగం సైతం భారీగా పెరిగిందంటున్న అధికారులు


సాక్షి, సిటీబ్యూరో: మత్తు...ఇది ఒకసారి అలవాటైందంటే ఎవరైనా చిత్తు కావాల్సిందే. అందుకే ఈ మహమ్మారికి బానిసలవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చిత్ర పరిశ్రమకు, డ్రగ్స్‌ మార్కెట్‌కు మధ్య ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ దాకా ప్రతి  చోటా ఇండస్ట్రీలో డ్రగ్స్‌ హవా నడుస్తోంది. కేవలం వినియోగమే కాదు విక్రయంలోనూ ముందుటున్నారని ఎక్సైజ్‌ అధికారులు అనుమానిస్తున్నారు. మోడలింగ్‌ కావచ్చు టాలీవుడ్‌ ప్రపంచం కావచ్చు డ్రగ్స్‌ వాడకం అనేది సర్వసాధారణ విషయంగా మారిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇండస్ట్రీలోని కొందరి సహకారంతో విస్తరిస్తున్న ఈ డ్రగ్స్‌ మాఫియా ఎంతో మందిని తన వల్లో వేసుకుంటోంది. బాలీవుడ్‌లో 1970ల్లోనే ఈ డ్రగ్స్‌ వాడకం వెలుగు చూసింది. అప్పటి నటీమణులు పర్వీన్‌బాబీ, ప్రతిమా బేడీలు ఈ విషయాన్ని బహిరంగంగానే అంగీకరించారు కూడా.

సంజయ్‌దత్‌ సైతం ఈ వ్యవహారంలో వివాదాస్పదుడయ్యాడు. మరో బాలీవుడ్‌ హీరో ఫర్దీన్‌ఖాన్‌ కొకైన్‌ను కలిగి ఉండి 2001లో ముంబై నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరోకు చిక్కాడు. అక్కడ పట్టుబడిన డ్రగ్‌ డీలర్‌ కరీమ్‌షేక్‌ అనేక మంది స్టార్ల పేర్లు బయటపెట్టాడు. నటుడు విజయ్‌రాజ్‌ డ్రగ్స్‌ తరలిస్తూ అబుదాబి పోలీసులకు చిక్కాడు. ఈ డ్రగ్స్‌ వినియోగ, విక్రయ జాడ్యం ఇప్పుడు టాలీవుడ్‌నూ పట్టింది. పటుత్వం కోసం, ముఖవర్చస్సు పెంపొందించుకోవడానికి, స్ట్రెస్‌ రిలీఫ్‌ పేరుతో వీటి వాడకం ఎక్కువ చేశారు. 2010 ఏప్రిల్‌లో ఎఫిడ్రిన్‌ స్మగ్లింగ్‌ కేసులో సినీ నిర్మాత వెంకటేశ్వరరావు మాదాపూర్‌ పోలీసులకు చిక్కారు. ఆపై సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేసిన ఉగాండా జాతీయులు ప్రాట్రిక్, ఐబేర్‌లు, టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన నైజీరియా జాతీయుడు ఒకాచోలు కొకైన్‌ స్మగ్లింగ్‌లో ఆరితేరారు. వీరి కస్టమర్లలో 80 శాతం సినీ రంగానికి చెందిన వర్థమాన తారలే ఉన్నారని అప్పట్లో వినిపించింది.

పార్టీలో కామనైన డ్రగ్స్‌...
డ్రగ్స్‌కు బానిసవుతున్న వారిలో యువత, విద్యార్థులు సైతం ఎక్కువగా ఉంటున్నారు. నగరంలోని ఖరీదైన ప్రాంతాల్లో ఉన్న పబ్స్, బార్స్‌తో పాటు నగర శివార్లలో ఉన్న ఫామ్‌హౌసుల్లో వీటిని వినియోగించడం స్టేటస్‌ సింబల్‌గా మారిపోయింది. కీలక వ్యక్తుల పార్టీల్లో మాదకద్రవ్యాలు కామన్‌గా కనిపించడం ప్రారంభించాయి. ఢిల్లీ, ముంబై తర్వాత డ్రగ్స్‌ వినియోగం రాజధానిలోనే ఎక్కువగా ఉందని సాక్షాత్తు పోలీసులే అంగీకరిస్తున్నారు. ఇక్కడ వినియోగం ఎక్కువగా ఉన్న కొకైన్‌ సౌత్‌ అమెరికా నుంచి హాంకాంగ్‌ మీదుగా దిగుమతి అవుతోంది. గంజాయి, చెరస్, ఆషిష్‌ ఆయిల్‌లను మెదక్, వరంగల్, ఖమ్మం, వైజాగ్,హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.

కొన్నింటి తయారీ సైతం...
కొన్ని రకాలైన మత్తుపదార్థాలను నగరంలోనే తయారు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ముడిసరుకును ఇక్కడకు తీసుకువచ్చి శివార్లలో ఉన్న కొన్ని బల్క్‌డ్రగ్‌ ఇండస్ట్రీస్‌లో వీటిని రూపొందిస్తున్నారు. ఎఫిడ్రిన్, మాండ్రక్స్‌ తయారీ యూనిట్లు హైదరాబాద్,గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ ఉన్నాయని తెలుస్తోంది.

ఏడేళ్ల తర్వాత మళ్ళీ...
దాదాపు ఏడేళ్ళ క్రితం సినీ నటుడు రవితేజ సోదరులైన రఘు, భరత్‌లు మాదకద్రవ్యాల కేసులో చిక్కినప్పుడు ఓసారి ఇలానే కలకలం రేగింది. అప్పట్లో వీరికి కొకైన్‌ విక్రయిస్తూ పట్టుబడిన నైజీరియా వాసి క్లెమంట్‌ సెల్‌ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా డ్రగ్స్‌ వినియోగిస్తున్న సెలబ్రెటీలపై పోలీసులకు ఓ అవగాహన వచ్చింది. తాజాగా ఎక్సైజ్‌ అధికారులకు చిక్కిన ముఠాలో కీలకంగా ఉన్న కెల్విన్‌ కాల్‌ డేటా ఆధారంగా పలువురు సినీ తారలకు నోటీసులు జారీ చేశారు. అయితే కేవలం నిందితుల ఫోన్, కాల్‌ డిటేల్స్‌లో ఉన్న నెంబర్ల ఆధారంగా అనుమానితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదని పోలీసులు చెప్తున్నారు.

ఎన్‌డీపీఎస్‌ (నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌) యాక్ట్‌ ప్రకారం మాదకద్రవ్యాలను తయారు చేయడం, కలిగి ఉండటం, సేవిస్తుండటం... ఈ మూడు సందర్భాల్లోనూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటే మాత్రమే నిందితులుగా పరిగణించే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఎక్సైజ్‌ అధికారులు తమ జాబితాలోని ప్రముఖులు, వారి సంబంధీకులను ప్రశ్నించడంతో పాటు కౌన్సెలింగ్‌ నిర్వహించాలని భావిస్తున్నారు.

నాడు ‘వదిలేశారు’.... నేడు ‘పట్టుకున్నారు’
2010లో రవితేజ సోదరులు రఘు, భరత్‌లు అరెస్టు అయినప్పుడు వీరితో చిక్కిన క్లెమెంట్‌ సెల్‌ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా పలువురు సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే అప్పట్లో ఆధారాలు లేవనే కారణంగా సరైన చర్యలు తీసుకోకుండా, గుట్టుచప్పుడు కాకుండా కౌన్సిలింగ్‌ నిర్వహించి విడిచిపెట్టారు. తాజాగా ఎక్సైజ్‌ అధికారులు మాత్రం మరో అడుగు ముందుకు వేశారు. కెల్విన్‌ సహా ఇతర నిందితుల కాల్‌డేటా ఆధారంగా వీరికి సినీ పరిశ్రమతో ఉన్న సంబంధాలను గుర్తించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి వరుసపెట్టి నోటీసులు ఇస్తున్నారు. ఈ నెల 19 నుంచి వీరిని ఎక్సైజ్‌ సిట్‌ కార్యాలయంలో ప్రశ్నించనున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో అనేక మంది సెలబ్రిటీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

పబ్స్‌ కేంద్రంగానే డ్రగ్స్‌...
ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో కెల్విన్, జీసన్, పీయూష్‌ ముగ్గురూ పబ్స్‌ కేంద్రంగా డ్రగ్స్‌ దందా చేసిన వారే. వీరంతా ప్రధానంగా పబ్స్‌లోనే మాదకద్రవ్యాలను విక్రయించామని విచారణలో వెల్లడించారు. సిటీలో ఉన్న పబ్స్‌పై సరైన నిఘా లేని కారణంగానే వీరి దందా యథేచ్ఛగా సాగినట్లు ఆరోపణలున్నాయి.

మరిన్ని వార్తలు