బాలీవుడ్‌కు సై.. టాలీవుడ్‌కు నై..

20 May, 2015 00:29 IST|Sakshi
బాలీవుడ్‌కు సై.. టాలీవుడ్‌కు నై..

బాలీవుడ్‌ను ఏలుతున్న ముంబయి ఫ్యాషన్
తెలుగు తెర కెక్కని స్థానిక సృజన

 
రోజూ ఆంగ్ల పత్రికల పతాక శీర్షికల్లో కనిపిస్తుంటారు. పాట్నీ నుంచి పారిస్ దాకా ర్యాంప్ మీద క్రియేటి విటీని మెరిపిస్తుంటారు. ప్రపంచ స్థాయి ఫ్యాషన్లకు దగ్గరగా ఉండే మన నగర డిజైనర్లు వెండితెరకు మాత్రం దూరమంటారు. ఒకటి రెండు హిట్లతో ‘తారా’పథానికి దూసుకుపోయే అవకాశాలను సైతం తూచ్.. అనేస్తున్నారు. తరుణ్ తహిల్యానీ, నీతాలుల్లా.. ఇలా ఏ ముంబయి డిజైనర్‌ని చూసినా హిందీ సినిమా ఫ్యాషన్ ‘వెలుగు’లకు కేరాఫ్‌గా ఉంటున్నారు. దీనికి భిన్నంగా తెలుగు సినిమా సోకులను తీర్చిదిద్దడాన్ని హైదరాబాద్ డిజైనర్లు ‘లైట్’గా తీకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే.. ఇదే సిటీ డిజైనర్లు బాలీవుడ్ సినిమాలకు, తారలకు సైతం డిజైన్లను అందిస్తున్నారు. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి
 
టాలీవుడ్‌లో భారీ సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. సిటీలో వరల్డ్ క్లాస్ ఫ్యాషన్ ఉత్పత్తులున్నాయి. అయితే ఈ రెండింటి మధ్యా సరైన వారధి మాత్రం  ఏర్పడలేదు. నగరంలో పేరున్న డిజైనర్లలో అత్యధికులు తెలుగు సినిమా రంగానికి దూరంగానే ఉంటున్నారు. గతంలో అస్మితా మార్వా, సాహిల్ గులాటి వంటి ఒకరిద్దరు కొన్ని సినిమాలకు వర్క్ చేసినా అరకొర దృష్టాంతాలే తప్ప, సిటీ డిజైన్స్‌కీ సినిమాకీ మధ్య గ్యాప్ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో కొందరు సిటీ టాప్ డిజైనర్లతో ‘సాక్షి’ ముచ్చటించినప్పుడు...
 
అదో ‘చిత్రమైన’ ప్రపంచం
 
తొలిసారి నాకు కృష్ణవంశీ ‘చక్రం’ సినిమాకు ఆఫర్ వచ్చింది. అయితే చాలా తక్కువ టైమ్ ఇచ్చారు. దాంతో చేయలేనని చెప్పేశాను. ఆ తర్వాత కృష్ణవంశీ తీసిన ‘రాఖీ’కి, రాఘవేంద్రరావు తనయుడు హీరోగా వచ్చిన ‘మార్నింగ్ రాగా’.. వంటి సినిమాలకు పనిచేశా. కానీ టాలీవుడ్‌లో ఇమడలేకపోయాను. నటి శ్రీయ శరన్ తో వర్క్ చేశాను. ఆమె చాలా డౌన్ టు ఎర్త్. అలాగే హ్యాండ్లూమ్ వర్క్స్ మాత్రమే వాడే షబానా ఆజ్మీ, లలిత్ దూబెతో చేసిన వర్క్ కూడా మెమొరబుల్. తప్పొప్పుల గురించి అనను గాని.. మన సినీ ఇండస్ట్రీలో మనగలగాలంటే కొన్ని ‘ప్రత్యేక’ శక్తియుక్తులు కావాలనేది నాకు అర్థమైంది. అవి లేవు కాబట్టి నేను నా వ్యక్తిగత మార్కెట్‌నే నమ్ముకున్నాను.
 - శశికాంత్ నాయుడు
 
సమయమే కీలకం..
 
బాలీవుడ్‌లో సోనమ్ కపూర్, విద్యాబాలన్ వంటివారికి డిజైన్స్ ఇచ్చాను. టాలీవుడ్ సినిమాలు చేయడం ఇష్టమే. కొన్నేళ్లగా భారతీయ మహిళ కట్టు, బొట్టు సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఖాదీ, సిల్క్స్, కాటన్ వస్త్రాలను రూపొందిస్తున్నాం. అయితే సినిమాలకు సంబంధించి ఉన్న ప్రత్యేక సమస్య సమయం.. సినిమా క్రియేషన్లు తక్కువ టైమ్‌లో ఎక్కువ వర్క్‌ని డిమాండ్ చేస్తాయి. అంతేకాకుండా మా వర్క్స్ పూర్తిగా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేవే. తగిన సమయం ఇచ్చి, మా తరహా వర్క్స్‌ని కోరుకునే స్థానిక సినిమా రూపకర్తలతో పనిచేయడానికి మాకు అభ్యంతరం లేదు. అనేక మంది బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలకు వ్యక్తిగతంగా మా గౌరంగ్ లేబుల్ చిరపరిచితం. అలాగే ఇండో వెస్ట్రన్ కలగలిపిన డిజైన్లను క్రియేట్ చేయడానికి, భారతీయ వస్త్ర శైలికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తేవడానికి సినీరంగానికి ఇదే సరైన సమయం అని నా అభిప్రాయం. - గౌరంగ్
 
అడిగితే ఎందుకు వర్క్ చేయం?

 
ఇప్పటిదాకా 13 ఫ్యాషన్ వీక్‌లలో పాల్గొన్నాను. కంటిన్యూస్‌గా నా కలెక్షన్స్ రిలీజ్ చేస్తుంటాను. అయితే టాలీవుడ్ నుంచి మూవీస్‌కి పనిచేయమని ఎవరూ అప్రోచ్ కాలేదు. అది మాకూ సర్‌ప్రైజింగ్. విశేషమేమిటంటే... నేను ముంబయిలో కంగనా రనౌత్‌తో పనిచేశాను. ఆమెకు డిజైన్స్ ఇచ్చాను. ముంబయిలో క్యారెక్టర్‌ను బట్టి నెయిల్ పాలిష్, హెయిర్ స్టైల్ ఇలా ప్రతి అంశంలోనూ పెద్ద రీసెర్చ్ జరుగుతుంది. మన సిటీలో ఫ్యాషన్ ఫాలోయర్స్ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరంతా చాలా వరకూ బాలీవుడ్‌నే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటారు. ఈ పరిస్థితి మారాలంటే టాలీవుడ్ మరింత ఫ్యాషన్ కాన్షియస్‌గా మారాల్సి ఉందేమో..! అయితే, ఇక్కడ కూడా నాకు చాలా మంది నటీనటులు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లు నా కలెక్షన్స్‌ను వ్యక్తిగతంగా వినియోగిస్తుంటారు.
 - శివాలీ సింగ్
 
సినీ వర్కింగ్ స్టైల్ వేరు..
 
మూవీస్ షెడ్యూలింగ్ కంప్లీట్‌గా డిఫరెంట్. టాలీవుడ్‌లో ప్రీ ప్లానింగ్ చాలా తక్కువ. ఫినిషింగ్ పట్టించుకోరు. లోపలెలా ఉన్నా పర్లేదు. అంతేకాదు నైట్ చెప్పి రేప్పొద్దున్నకల్లా కావాలంటారు. అది డిజైనర్ వర్క్ స్టైల్ కాదు. ఫ్యాషన్ డిజైనర్ అంటే సీరియస్ ట్రెండ్ సెట్టర్స్. నా వరకూ ఒక్క కరెంట్‌తీగలో మాత్రం రకుల్‌ప్రీత్ సింగ్‌కి చేశాను. నా వర్కింగ్ స్టైల్ తెలుసు కాబట్టి. మంచు లక్ష్మి నాకు తగిన టైమ్ ఇచ్చి చేయించుకున్నారు. ముందే బ్రీఫ్ చేసి టైమ్ ఇవ్వడం వల్ల చేయగలిగాను. పార్టీస్‌కి, ఈవెంట్స్‌కి మాత్రం స్టార్స్ చాలా వరకూ డిజైనర్స్ క్రియేషన్స్ వేసుకుంటారు. ‘కామెడీ విత్ కపిల్’ అనే బిగ్ టీవీ షోకి శృతిహాసన్ నా డిజైన్ వేసుకుంటే అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. అలాగే సన్ని లియోన్‌కి కూడా డిజైన్స్ ఇచ్చాను. బాలీవుడ్‌లో అడుగుతున్నారు కాబట్టి అనే కాదు.. వాళ్లు తగిన టైమ్ ఇస్తారు కూడా.  
 - శిల్పారెడ్డి

మరిన్ని వార్తలు