రేపు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష

21 May, 2016 03:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఆదివారం (ఈనెల 22న) జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహించేందుకు గువాహటి ఐఐటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన వారిలో 1.98 లక్షల మందిని ఈ పరీక్షకు ఎంపిక చేయగా.. వారిలో 1.56 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ, ఏపీల నుంచి అడ్వాన్స్‌డ్ పరీక్షకు 28,951 మంది (ఆంధ్రప్రదేశ్ 14,703, తెలంగాణ 14,248 మంది) అర్హత సాధించగా... దాదాపు 21 వేల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్‌లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

 ఈ జాగ్రత్తలు తప్పనిసరి: పేపర్-1 పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు.. పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది. ఈ రెండు పేపర్లు రాసిన వారికే ర్యాంకులను ఇస్తామని గువాహటి ఐఐటీ ప్రకటించింది. పేపర్-1కు ఉదయం 7:30కల్లా, పేపర్-2కు మధ్యాహ్నం ఒంటి గంటకల్లా పరీక్షా హాల్‌లోకి చేరుకోవాలని పేర్కొంది. అభ్యర్థుల డిజిటల్ ఫొటోలు, వేలిముద్రలు తీసుకోవాల్సి ఉన్నందున.. ముందుగానే పరీక్ష హాల్లోకి రావడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. నిర్ణీత సమయానికి మించి ఆలస్యమైతే పరీక్ష హాల్లోకి అనుమతించబోమని హెచ్చరించింది. పారదర్శకంగా ఉండే బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులు, పెన్సిల్, ఎరేజర్‌లను మాత్రమే హాల్లోకి అనుమతిస్తామని తెలిపింది. ఫుల్ షర్ట్, కోట్‌లు, బూట్లు, హైహీల్ చెప్పులు వేసుకోవద్దని సూచించింది. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను, ఆభరణాలను అనుమతించరని స్పష్టం చేసింది. జూన్ 12న ఆలిండియా ర్యాంకులను ప్రకటిస్తామని వివరించింది.

>
మరిన్ని వార్తలు