నల్లగొండ బరిలో నువ్వా నేనా..

9 Dec, 2015 17:21 IST|Sakshi
నల్లగొండ బరిలో నువ్వా నేనా..

ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల పర్వం
 
హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు చేతులెత్తేశాయి. నిన్నమొన్నటి వరకు హడావిడి చేసిన పార్టీలు అనేక చోట్ల అసలు నామినేషన్లు కూడా దాఖలు చేయలేదు. తెలంగాణలో స్థానిక సంస్థల ప్రతినిధుల ద్వారా ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎన్నికలకు బుధవారం సాయంత్రంతో నామినేషన్ల ఘట్టం ముగిసింది.
 
మొత్తం 12 స్థానాలకు గాను అధికార టీఆర్‌ఎస్ అన్నింటికీ నామినేషన్లు వేసింది. మిగతా పార్టీలు కొన్ని జిల్లాలకే పరిమితమయ్యాయి. కాంగ్రెస్ 5 చోట్ల మాత్రమే బరిలో నిలిచింది. టీడీపీదీ అదే పరిస్థితి. బీజేపీ అసలు ఈ ఎన్నికల బరిలోనే లేదు.
 
ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను బట్టి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పోటీ రసవత్తరంగా సాగే అవకాశాలున్నాయి. నల్లగొండలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఒక నామినేషన్ దాఖలైనా ఆ ప్రభావం కాంగ్రెస్‌ పై ఉండదని చెబుతున్నారు.
 
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు తెలంగాణ శాసనమండలిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా పెంచాల్సి ఉన్న నేపథ్యంలో కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల స్థానిక సంస్థల్లో అదనంగా ఒక్కో స్థానాన్ని పెంచిన విషయం తెలిసిందే.
 
మొత్తంగా 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, ఈ స్థానాలన్నీ గతమే ఒకటి నుంచి ఖాళీగా ఉన్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. గురువారం నామినేషన్ల పరిశీలన పూర్తి చేస్తారు. 12 వ తేదీ వరకు ఉపసంహరణకు గడువుంది. ఈనెల 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వీటికి పోలింగ్ నిర్వహిస్తారు. 30వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది.

బరిలో నిలిచింది వీరే...
రంగారెడ్డి (2 స్థానాలు): పట్నం నరేందర్ రెడ్డి (టీఆర్‌ఎస్), శంభీపూర్ రాజు (టీఆర్‌ఎస్), ఎ. చంద్రశేఖర్ (కాంగ్రెస్), దారా సింగ్ (కాంగ్రెస్), బుక్కా వేణుగోపాల్ (టీడీపీ), కొత్త అశోక్‌గౌడ్ (ఎంపీటీసీల ఫోరం).
 
కరీంనగర్ (2 స్థానాలు): నారదాసు లక్ష్మణరావు (టీఆర్‌ఎస్), భానుప్రసాదరావు (టీఆర్‌ఎస్), మునిపాక తిరుపతిరావు (స్వతంత్ర), ముద్దసాని రంగయ్య (స్వతంత్ర), తాటిపాముల రాజు (స్వతంత్ర), ముత్యాల ప్రియారెడ్డి (స్వతంత్ర), సిరిసిల్ల ప్రసాద్ (స్వతంత్ర).
 
మహబూబ్‌నగర్ (2 స్థానాలు): ఎస్.జగదీశ్వర్‌రెడ్డి (టీఆర్‌ఎస్), కె.నారాయణరెడ్డి (టీఆర్‌ఎస్), కె.దామోదర్‌రెడ్డి (కాంగ్రెస్), కె.దయాకర్‌రెడ్డి (టీడీపీ), కె.శ్రీనివాసాచారి (స్వతంత్ర), బోళ్ల కరుణాకర్ (స్వతంత్ర), జగదీశ్వర్‌రెడ్డి (స్వతంత్ర).
 
ఆదిలాబాద్ (1 స్థానం): పురాణం సతీష్‌కుమార్ (టీఆర్‌ఎస్), రియాజుద్దీన్ (ఎంపీటీసీల ఫోరం), ఐ.నారాయణ రెడ్డి (టీడీపీ),
 
నల్లగొండ (1 స్థానం): తేరా చిన్నపరెడ్డి (టీఆర్‌ఎస్), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (కాంగ్రెస్), సాదినేని శ్రీనివాసరావు (టీడీపీ), మిట్ట పురుషోత్తమరెడ్డి (స్వతంత్ర).

నిజామాబాద్ (1 స్థానం): ఆర్.భూపతిరెడ్డి (టీఆర్‌ఎస్), కె.వెంకట రమణారెడ్డి (కాంగ్రెస్), బి.జగదీష్ (ఎంపీటీసీల ఫోరం).
 
ఖమ్మం (1 స్థానం): బాలసాని లక్ష్మీనారాయణ (టీఆర్‌ఎస్), పువ్వాడ నాగేశ్వరరావు (సీపీఐ), లింగాల కమల్‌రాజ్ (వైఎస్సార్‌సీపీ), జి. లక్ష్మీనారాయణ (స్వతంత్ర), కె.లక్ష్మీనారాయణ (స్వతంత్ర).
 
వరంగల్ (1 స్థానం): కొండా మురళి (టీఆర్‌ఎస్) మహబూబ్ రెడ్డి (స్వతంత్ర), చంద్రమౌళి (స్వతంత్ర), మోడెం మల్లేష్ (స్వతంత్ర), ఎ.నరేందర్‌రెడ్డి (టీడీపీ), రంగరాజు రవీందర్ (స్వతంత్ర).
 
మెదక్ (1 స్థానం): వి. భూపాల్‌రెడ్డి (టీఆర్‌ఎస్), శివరాజ్‌ పాటిల్ (కాంగ్రెస్) , కొన్యాల బాల్‌రెడ్డి (టీడీపీ).

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు