టఫ్ గాళ్స్... టామ్‌బాయ్స్!

8 Mar, 2016 00:23 IST|Sakshi
టఫ్ గాళ్స్... టామ్‌బాయ్స్!

సిగ్గుల మొగ్గవుతూ... గుమ్మం చాటున నిలబడి కాలిగోళ్లతోనే ముగ్గులు వేసే బాపూబొమ్మల స్థానంలో అబ్బాయిలతో సమానంగా రఫ్ఫాడిస్తున్న రఫ్ అండ్ టఫ్ గాళ్స్ వచ్చేస్తున్నారు. అనుక్షణం అణిచివేతలకు, అనుసరించే వేటగాళ్ల వేధింపులకు తిరస్కారంగా  మగవాళ్లకు థీటుగా తమను తాము మలచుకుంటున్నారు అమ్మాయిలు. ఏతావాతా టామ్‌బాయ్స్ తరహా అమ్మాయిలు పెరుగుతున్నారు. ‘నేను టామ్‌బాయ్ టైప్’ అంటూ సగర్వంగా చెప్పుకుంటున్నారు సిటీ అమ్మాయిలు. -సాక్షి, లైఫ్‌స్టైల్‌ప్రతినిధి
 
ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందనగానే కలిగేంత బాధ ఇప్పుడు లేదు. పుట్టిన దగ్గర్నుంచీ ఆ అమ్మాయిని అబ్బాయిలాగా పెంచాలనే తపన తప్ప. ‘మా అమ్మాయిని చిన్నప్పటి నుంచీ ఆడపిల్ల అనుకోలేదు. అబ్బాయిల్తో సమానంగా పెంచాను’ అని చెప్పారు బేగంపేట నివాసి రాకేష్ గులాటి. ప్రస్తుతం ఆయన కుమార్తె ఆ పెంపకానికి తగ్గట్టే... క్రీడల్లో అబ్బాయిలతో సమానంగా దూసుకుపోతోంది.
 
నిజం... ఇది టామ్‌బాయిజం...
ఒక అమ్మాయి మగవారిలా దుస్తులు ధరిం చడం, అదే తరహాలో రఫ్ అండ్ టఫ్‌గా ప్రవర్తించడం 15వ శతాబ్ధంలో వెలుగులోకి వచ్చిన పదంగా టామ్‌బాయ్‌ని చెబుతారు. అనంతరం 19వ శతాబ్దంలో బాగా వ్యాయా మం చేస్తూ, కండపుష్టిని అందించే డైట్‌ని తీసుకునే అమ్మాయిలను అమెరికాలో టామ్‌బాయ్‌లుగా అభివర్ణించారట. అలా అలా ఆ పదం డైనమిక్‌గా, అడ్వంచరస్‌గా ఉండే అమ్మాయిలకు పర్యాయపదంలా మారింది.     
 
అబలకు బై...  సబలల సై

సిగ్గుల మొగ్గల్లా ముడుచుకుపోయే కన్నా సివంగిలా ముందుకురికే ఆడపిల్లలకే ప్రస్తుత సమాజంలో గెలుపు సాధ్యం అని ఆధునిక మహిళలు భావిస్తున్నారు. ‘యోగా సర్టిఫైడ్ ఇన్‌స్ట్రక్టర్‌ని. నేను జిమ్నాస్టిక్స్‌లో సర్టిఫికెట్ హోల్డర్‌ని.  బైక్ డ్రైవింగ్ కాలేజ్ డేస్ నుంచే వచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే నేను టామ్‌బాయ్ టైప్’ అని శ్రీనగర్‌కాలనీ నివాసి నేహా చౌదరి చెప్పారు.  ఈ రోజుల్లో ఇలా ఉంటే ఎలా బ్రతుకుతాం లాంటి ఆలోచనల నేపథ్యమే ఈ టామ్‌బాయ్ ట్రెండ్ అనొచ్చు. ‘చిన్నప్పటి నుంచి బైక్ నడపడంలోనే కాదు ఫీట్స్ చేయడంలో కూడా అబ్బాయిలతో పోటీపడేదాన్ని. అప్పుడూ ఇప్పుడూ నేను టామ్‌బాయ్ టైపే’ అని నగరం నుంచి సినిమా హీరోయిన్‌గా రాణిస్తున్న
తేజస్విని చెప్పారు.
 
కాలు కదిపితే చాలు కామపు చూపులు, వేలు తాకినా చాలన్నట్టు కొనసాగుతున్న మగాళ్ల వేధింపులు కూడా అమ్మాయిల్లో  రఫ్‌నెస్ పెరిగేందుకు దోహదం చేస్తున్నాయని మానసిక నిపుణులు అంటున్నారు. అనుక్షణం రక్షణగా ఉండలేక, అటు వెళ్లకు, ఇటు వెళ్లకు వంటి ఆంక్షలతో ఆడపిల్లల స్వేచ్ఛని హరించలేక అమ్మాయిలు టామ్‌బాయ్స్‌లా  పెరగడమే మేలని తల్లిదండ్రులు సైతం ఈ ధోరణికి ఊతమిస్తున్నారు. ‘నన్నిలా రఫ్ అండ్ టఫ్‌గా మార్చింది మా నాన్నగారే అని చెప్పాలి. అమ్మాయిలా వయ్యారంగా తయారయి వెళితే మరింతగా పోకిరీలు రెచ్చిపోతారు. అందుకే  కావాలని బైక్ నేర్చుకున్నాను. ఎంత అర్ధరాత్రయినా జాకెట్ గ్లవ్స్ అవీ వేసుకుని రఫ్‌గా కనిపిస్తాను’ అంటూ చెప్పారు బంజారాహిల్స్‌కు చెందిన దివ్య.
 
సాహసమే జీవనం

మరోవైపు మగువల్లో ఈ తరహా తెగింపు వారిని మరిన్ని సాహసాలవైపు నడిపిస్తోంది. గత కొన్నేళ్లుగా అడ్వంచర్స్ క్లబ్‌లో నమోదు చేసుకుంటున్న సభ్యుల్లో అమ్మాయిల సంఖ్య శరవేగంగా పెరుగుతోందని క్లబ్ నిర్వాహకులు రంగారావు చెప్పారు. ఒకప్పుడు మొత్తం సభ్యుల్లో వీరి సంఖ్య 5 శాతం లోపే, అయితే ఇటీవల అది బాగా పెరిగి దాదాపు 25 శాతానికి చేరిందన్నారు. మగవాళ్లు సైతం తటపటాయించే రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్... వంటి ప్రమాదభరిత సాహసాలకు సైతం అమ్మాయిలు సై అంటున్నారని వివరించారాయన.  
 

మరిన్ని వార్తలు