టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ అత్యావశ్యకం

21 May, 2016 04:48 IST|Sakshi
టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ అత్యావశ్యకం

వీలైనంత త్వరగా ఏర్పాటుకు చర్యలు తీసుకోండి
ట్రిబ్యునల్‌తో అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట
ఉల్లంఘనులను అరెస్ట్ చేసి, ప్రాసిక్యూట్ చేసేలా చూడండి
సర్కార్, జీహెచ్‌ఎంసీ అధికారులకు హైకోర్టు ఆదేశం
 
 సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ తామరతుంపరల్లా పుట్టుకొస్తున్న అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలంటే వాటిని కూల్చివేస్తే సరిపోదని, వాటిని నిర్మించిన వారిపై చట్టపరంగా చర్యలకు ఉపక్రమించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉల్లంఘనులపై జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 461(4) కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయవచ్చని, ఈ విషయంలో జీహెచ్‌ఎంసీ సంశయించడానికి ఎటువంటి కారణం లేదని తేల్చిచెప్పింది. అక్రమ నిర్మాణాలు, ప్లాన్‌కు విరుద్ధంగా వెలసిన నిర్మాణాలకు సంబంధించిన కేసులను సత్వరమే పరిరక్షించేందుకు జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణలు చేసి టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలన్న జీహెచ్‌ఎంసీ అభ్యర్థనపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అక్రమ నిర్మాణదారులు చట్టాలను అపహాస్యం చేస్తూ సివిల్ కోర్టులకెళ్లి అనుకూల ఉత్తర్వులు పొందుతూ అక్రమ నిర్మాణాలను పూర్తి చేస్తున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసేందుకు టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు అత్యావశ్యకమని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి గురువారం తీర్పు వెలువరించారు.

 ఇదీ వివాదం...
 తన పొరుగింటి వారు ఎటువంటి సెట్‌బ్యాక్‌లు విడిచిపెట్టకుండా అనుమతి పొందిన ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని, దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకునేలా జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించాలని హైదరాబాద్‌కు చెం దిన జాన్ మహమ్మద్ అలియాస్ షాహాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి అక్రమ నిర్మాణాలను మొగ్గలోనే తుంచి వేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ ఓ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించా రు. ఈ ఆదేశాల మేరకు కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి ఓ అఫిడవిట్‌ను కోర్టు ముందుంచారు. ప్రభుత్వం ముందు తాముంచిన ప్రతిపాదనలను కోర్టుకు వివరించారు. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వ స్పందనను వివరిస్తూ పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.జి.గోపాల్ కూడా ఓ అఫిడవిట్‌ను సమర్పించారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటూ జస్టిస్ నాగార్జునరెడ్డి గురువారం తీర్పునిచ్చారు.

 ట్రిబ్యునల్‌తోనే ప్రణాళికాబద్ధ అభివృద్ధి..
 ‘జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణ చేసి టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని గ్రేటర్ కమిషనర్ ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి సమర్థనీయమే. అక్రమ కట్టడాల కూల్చివేతకు కార్పొరేషన్ నుంచి నోటీసులు అందుకున్న వ్యక్తులు సివిల్ కోర్టులను ఆశ్రయిచి ఇంజక్షన్ ఉత్తర్వులు పొందుతున్నారు. ఈ ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని అక్రమ నిర్మాణాలను పూర్తి చేస్తున్నారు. ఇదంతా ఓ క్రమపద్ధతిలో సాగుతోంది. ఉల్లంఘనులు చట్టాలను కాలరాస్తూ, కోర్టు ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని ప్రణాళికబద్ధంగా సాగాల్సిన నగరాభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు అత్యావశ్యకం. ఈ ట్రిబ్యునల్‌లో టౌన్ ప్లానింగ్‌లో అనుభవజ్ఞుడైన ఒక వ్యక్తి తప్పనిసరిగా ఉండాలి. తద్వారా తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల పరిధుల్లో విస్తృతంగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకుని ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి సాధ్యమవుతుంది’ అని నాగార్జునరెడ్డి పేర్కొన్నారు.

 యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయండి...
 ‘జీహెచ్‌ఎంసీలో 200 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకి తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తన అఫిడవిట్‌లో చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్‌సీర్లను తగిన సంఖ్యలో కార్పొరేషన్‌కు డిప్యూటేషన్‌పై పంపాలి. కార్పొరేషన్ అధికారులు సైతం అక్రమ నిర్మాణాల కూల్చివేతకు నోటీసులు జారీ చేసి చేతులుదులుపుకోకుండా సెక్షన్ 461(4) కింద ఉల్లంఘనులు, అక్రమ నిర్మాణదారులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వారిని ప్రాసిక్యూట్ చేసేలా చూడాలి. ఇక ఈ కేసు విషయానికొస్తే అక్రమ నిర్మాణదారులకు అనుకూలంగా సివిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎత్తివేసేందుకు కార్పొరేషన్ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలి’ అని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు