ఇంకా కోలుకోని హైదరాబాద్ నగరం...

1 Sep, 2016 11:23 IST|Sakshi
ఇంకా కోలుకోని హైదరాబాద్ నగరం...
హైదరాబాద్: బుధవారం కురిసిన భారీ వర్షంతో అస్తవ్యస్థమైన హైదరాబాద్ నగరం ఇంకా కోలుకోలేదు. నగరంలోని పలు కాలనీలు, ప్రభుత్వ కార్యాలయాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ప్రధాన రహదారుల వెంట, నాలాల వద్ద చెత్తాచెదారం పేరుకుపోవడంతో రోడ్లపైకి నీరు చేరుకుంది. దీంతో ట్రాఫిక్కు ఆటంకం ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
 
నగర మేయర్, జీహెచ్ఎంసీ  ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది నాలాలను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. పారిశుద్ధ్య లోపంతో వ్యాధులు ప్రబలే అవకాశముందని.. ప్రజలు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పాదచారులు, వాహనదారులు మ్యాన్ హోల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. 
 
మరో వైపు గురువారం కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శిధిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించే పనిలో గ్రేటర్ అధికారులున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హుస్సేన్సాగర్ వద్ద గురువారం వరద ఉధృతి తగ్గింది. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 513.62 అడుగులుగా ఉంది.  
 
>
మరిన్ని వార్తలు