ట్రాఫిక్ ఫ్రీ మార్గం కావాలి...

1 Apr, 2015 23:17 IST|Sakshi
ట్రాఫిక్ ఫ్రీ మార్గం కావాలి...

మైత్రివనం-లక్డీకాపూల్ రూట్లో
అడ్డంకుల తొలగింపుపై సమావేశం
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
సోమేశ్‌కుమార్ ఆదేశం
 

సిటీబ్యూరో:  నగరంలోని మైత్రివనం నుంచి లక్డీకాపూల్ నిరంకారి భవన్ వరకు ఉన్న మార్గాన్ని ట్రాఫిక్ ఫ్రీ రూట్‌గా మార్చడానికి, మధ్యలో ఉన్న అడ్డంకులు తొలగించడానికి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ అన్నారు. బుధవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ, పోలీసు, ట్రాఫిక్, మెట్రోరైలు, ఆర్టీసి, జలమండలి,విద్యుత్ తదితర శాఖల ఉన్నతాధికారులతో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మైత్రివనం నుంచి లక్డీకాపూల్ నిరంకారీ భవన్ వరకు ట్రాఫిక్  ఇబ్బందులు తొలగించడానికి  రోడ్ల విస్తరణ, దారివెంట ఉన్న శ్మశాన వాటికలను తొలగించకుండా వాటిపై ర్యాంప్‌ల నిర్మాణాలను చేపట్టడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని సూచించారు.  అదేవిధంగా ఆ మార్గంలో ఉన్న ప్రార్ధన స్థలాలను ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండే విధంగా సంబంధిత వర్గాలతో చర్చించాలన్నారు. అదేవిధంగా  ఎంజే మార్కెట్ నుంచి  నాంపల్లి వరకు నాలుగు ప్రాంతాల్లో  ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో  మల్టీలెవల్ పార్కింగ్ నిర్మాణానికి అధ్యయనం  చేయనున్నట్లు తెలిపారు. 760 మీటర్ల  పొడవు గల ఈ కారిడార్‌ను ట్రాఫిక్ రహితంగా అభివృద్ధి చేయడానికి  త్వరలో  పనులు చేపట్టనున్నట్లు  పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 60 బస్ షెల్టర్ల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ షెల్టర్లను నిర్మించే స్థలాలను  గుర్తించి తమకు అందజేస్తే  వెంటనే పనులు ప్రారంభించనున్నట్లు ఆర్టీసి అధికారులకు ఆయన సూచించారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ జంక్షన్ అభివృద్ధి, బస్ షెల్టర్ల ఏర్పాటు ప్రాంతాల్లో కనీస సౌకర్యాల ఏర్పాటుతో పాటు ఆటో స్టాండ్లకు  తగు స్థలం కూడా కేటాయించాలని సూచించారు.  నగరంలో వివిధ జంక్షన్లలో ట్రాఫిక్ లైట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందని, వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని కోరారు.

సిటీ యూత్‌కు పోలీసు సెలక్షన్ ట్రైనింగ్

నగరంలోని యువత ప్రధానంగా పాతబస్తీ యువతకు పోలీసు  ట్రైనింగ్ శిక్షణ  ఇవ్వనున్నట్లు  జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. సిటీ పోలీసు విభాగంలో కలిసి నిర్వహించే శిక్షణను త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్‌రెడ్డి మాట్లాడుతూ మెట్రోరైలు నిర్మాణ మార్గంలో ఉన్న అవరోధాలను తొలగించడానికి సంబంధిత శాఖలు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు.
 

మరిన్ని వార్తలు