బారాత్‌లతో ట్రాఫిక్ బంద్

18 Jul, 2016 18:26 IST|Sakshi

ప్రధాన రహదారులపై ఫంక్షన్ హాలు ఉంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో రాజేంద్రనగర్ ప్రాంత ప్రజలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదనే చెప్పొచ్చు. ప్రతి రోజూ రాత్రి వేళల్లో ఫంక్షన్ హాళ్ల వద్ద గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ సమస్యలను ట్రాఫిక్, లా ఆండ్ ఆర్డర్ పోలీసులు పట్టించుకోవటం లేదు. వారు ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లలో మత్తులో పడి పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు.

 

వివరాల ప్రకారం... రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా, ఆరాంఘర్ చౌరస్తా నుంచి అటూ దానమ్మ ఆర్చ్, ఇటూ బండ్లగూడ చౌరస్తా, శాతంరాయ్ వరకు 20కు పైగా ఫంక్షన్ హాళ్లున్నాయి. ఇవన్నీ ప్రధాన రోడ్డుకు పక్కనే కొనసాగుతున్నాయి.

 

రాత్రి సమయాలలో ఈ ఫంక్షన్ హాళ్లకు వచ్చే బారాత్‌లు, వాహనాల కారణంగా తరచూ ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఉడెంగడ్డలోని ఫంక్షన్ హాల్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన వివాహ కార్యక్రమ బారాత్ సందర్భంగా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు వాహనదారుల ఇబ్బందులను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ఇలా, దాదాపు ప్రతి నిత్యమూ ఈప్రాంతాలలో వాహనాల రాకపోలకు అంతరాయం కలుగుతోంది. ఈ విషయంలో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

 

మరిన్ని వార్తలు