ఒకటి నుంచే ‘ట్రాఫిక్‌ బోధన’

27 Mar, 2017 03:55 IST|Sakshi
ఒకటి నుంచే ‘ట్రాఫిక్‌ బోధన’

రహదారి భద్రతను సబ్జెక్ట్‌గా చేర్చాలని నిర్ణయం
ఎస్సీఈఆర్టీ బృందంతో ట్రాఫిక్‌ కాప్స్‌ కసరత్తు
ఇప్పటికే పాఠ్యాంశాలు సిద్ధం చేసిన పోలీసులు
ఈ ఏడాదికి ఆన్‌లైన్‌లో ఈ–బుక్స్‌


సాక్షి, సిటీబ్యూరో:
రహదారిపై ఏఏ ప్రాంతాల్లో వాహనాలను పార్క్‌ చేసుకోవాలి? పార్కింగ్‌లో ఉన్న రకాలను వివరించండి.
ట్రాఫిక్‌ సిగ్నల్‌లో ఎన్ని లైట్లు ఉంటాయి? ఏఏ రంగు దేన్ని సూచిస్తుందో సోదాహరణగా రాయండి.
రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఏమిటి?
అత్యవసర సమయాల్లో ఏఏ నెంబర్లకు సంప్రదించాలో పేర్కొనండి.

....ఇకపై విద్యార్థులకు పరీక్షల్లో ఈ తరహా ప్రశ్నలూ ఎదురుకానున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ‘రహదారి భద్రత విద్య (రోడ్డు భద్రత, జాతి భవిష్యత్తు)’ పేరుతో అదనంగా ఓ సబ్జెక్ట్‌ చేరనుంది. ఈ మేరకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు,  స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్సీఈఆర్టీ) వారు కసరత్తు పూర్తి చేశారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులను ఉద్దేశించి మూడు పుస్తకాలను డిజైన్‌ చేశారు.

ఆరు నుంచి ఎనిమిది వరకు అనుకున్నా...
రహదారి భద్రత విద్య సబ్జెక్ట్‌ను కేవలం ఆరు నుంచి ఎనిమిదో తరగతి వారికి మాత్రమే పరిచయం చేయాలని, వారిలో అవగాహనకు కృషి చేయాలని ప్రాథమికంగా ట్రాఫిక్‌ విభాగం అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు గత ఏడాదే ప్రాథమికంగా పాఠ్యాంశాలను సైతం సిద్ధం చేశారు. అయితే నగర పోలీసు కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి ఆలోచన, ఆదేశాల మేరకు ఒకటో తరగతి నుంచే అమలు చేయాలని నిర్ణయించారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రోడ్డు క్రాసింగ్, లైన్‌ డిసిప్లేన్‌ వంటి ప్రాథమిక అంశాలను బోధించనున్నారు. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు రహదారి భద్రతకు సంబంధించి లోతైన అంశాలతో పాటు ఎంవీ యాక్ట్‌లోని కీలక నిబంధనలు, వాటిని పాటిస్తే కలిగే లాభాలు, విస్మయిస్తే చోటు చేసుకునే పరిణామాలు తదితర అంశాలను పాఠ్యాంశంగా చేర్చనున్నారు. తొమ్మిది పది తరగతులకు పార్కింగ్‌ విధానాలు, వాటిలో ఉండే లోటుపాట్లు, రహదారి భద్రత నిబంధనల్నీ వివరించనున్నారు.

ఈ ఏడాదికి ఈ–బుక్స్‌ రూపంలో...
ఈ విద్యా సంవత్సరం (2017–18) నుంచే రహదారి భద్రత విద్యను ఓ సబ్జెక్ట్‌గా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని ఎస్సీఈఆర్టీ ట్రాఫిక్‌ అధికారులు పేర్కొన్నారు. అయితే తుది కసరత్తులు మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ ఏడాదికి టెక్ట్స్‌బుక్స్‌ అందించడం కష్టసాధ్యమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాఫ్ట్‌కాపీలను సిద్ధం చేసి పాఠశాలలకు ఆన్‌లైన్‌లో ఈ–బుక్స్‌ రూపంలో పంపించాలని భావిస్తున్నారు. వాటిని ఆయా పాఠశాలలకు చెందిన వారు ప్రింట్‌ఔట్స్‌ రూపంలో విద్యార్థులకు ఇచ్చేలా చర్యలు తీçసుకుంటారు. వచ్చే విద్యా సంవత్సరం (2018–19) నుంచి సోషల్‌ లేదా మోరల్‌ సైన్స్‌లకు అనుబంధంగా రహదారి భద్రత విద్య సబ్జెక్ట్‌ టెక్ట్స్‌బుక్స్‌ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఎస్సీఈఆర్టీతో భేటీ అయిన ట్రాఫిక్‌ పోలీసులు ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ సబ్జెక్టులు, అందులోని అంశాలను పరిశీలించారు.

ఇతర ఉపయుక్తమైన అంశాలు...
రహదారి భద్రత విద్య సబ్జెక్ట్‌లో కొన్ని ఇతర ఉపయుక్తమైన అంశాలను చేర్చాలని ట్రాఫిక్‌–ఎస్సీఈఆర్టీ అధికారులు నిర్ణయించారు. 100, 101, 108 వంటి ఎమర్జెన్సీ నెంబర్ల ఉద్దేశం, వాటిని వినియోగించాల్సిన విధానం, దుర్వినియోగం చేస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితులు తదితర వివరాలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటితో పాటు ఇంటి పరిసరాలు, వీధులు, కాలనీలు పరిశుభ్రంగా ఉంచడానికి పాటించాల్సిన అంశాలనూ పాఠ్యాంశాలుగా చేర్చనున్నారు. రాష్ట్రంలో రాష్ట్ర, కేంద్ర సిలబస్‌లతో నడిచే పాఠశాలలు ఉన్నాయి. తొలి దశలో స్టేట్‌ సిలబస్‌లోని పాఠ్యపుస్తకాల్లో ట్రాఫిక్‌ పాఠాలను చేరుస్తున్నారు. సెంట్రల్‌ సిలబస్‌ అమలులో ఉన్న పాఠశాలలకు బుక్‌లెట్స్‌ను సరఫరా చేసి ప్రత్యేక పీరియడ్స్‌ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఇక్కడ పూర్తిస్థాయిలో అమలైన తర్వాత కేంద్రం పరిధిలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌కు (ఎన్సీఈఆర్టీ) లేఖ రాయడం ద్వారా ఆ సిలబస్‌లోనూ పాఠ్యాంశాలుగా చేర్చేలా ప్రయత్నాలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

పాఠ్యాంశంగా కాకుండా సబ్జెక్ట్‌గా..
‘ఏటా వేల మందిని పొట్టనపెట్టుకుంటున్న, అంతకు రెట్టింపు సంఖ్యలో క్షతగాత్రులుగా మారుస్తున్న రోడ్డు ప్రమాదాలను నిరోధించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీనికి సంబంధించి అవసరమైన అన్ని రకాలైన చర్యలు తీసుకోవాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్‌ అంశాలను సబ్జెక్టుగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తొలుత దీన్ని ఓ పాఠ్యాంశంగా చేర్చాలని భావించాం. అయితే ప్రతి విద్యార్థి నేర్చుకోవడమేనేది కచ్చితంగా చేయడానికే సబ్జెక్టుగా పెట్టాలని నిర్ణయించాం. బడి ఈడు నుంచే బాధ్యతల్ని పెంచితే సత్ఫలితాలు ఉంటాయి. ఆ మేరకు విద్యాశాఖ అధికారులతో కలిసి కసరత్తు పూర్తి చేస్తున్నాం’.
– ఏవీ రంగనాథ్, ట్రాఫిక్‌ డీసీపీ

ఏఏ తరగతుల వారికి ఏం బోధిస్తారంటే...
ఒకటో తరగతి: ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ప్రాముఖ్యత
రెండో తరగతి: పాదచారులు–జాగ్రత్తలు
మూడో తరగతి: రవాణా సౌకర్యాలు –వాహనాలపై ప్రయాణం
4,5,6,7 తరగతులు: రోడ్డు భద్రత–ప్రాముఖ్యత, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌–సైన్‌ బోర్డులు, రోడ్‌ ప్రమాదాలు–కారణాలు, భద్రతా చర్యలు–సురక్షిత ప్రయాణం, విద్యార్థులు, రవాణా సౌకర్యాలు
8,9,10 తరగతులు: రోడ్డు భద్రత–ప్రాముఖ్యత, వాహనాలు నిలుపు విధానం, ట్రాఫిక్‌ నిర్వహణ, రోడ్డు ప్రమాదాలు– నిరోధించే మార్గాలు, భద్రతా చర్యలు, తప్పనిసరిగా ఉండాల్సిన పత్రాలు.
(ప్రతి తరగతి వారికీ కొన్ని వీడియో క్లాసులు ఉండేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి) 

మరిన్ని వార్తలు