డ్రైవింగ్‌లో శిక్షణ.. ఉపాధి..

19 Jun, 2017 03:19 IST|Sakshi
డ్రైవింగ్‌లో శిక్షణ.. ఉపాధి..
- డ్రైవర్‌ ఎంపవర్‌మెంట్‌ స్కీం తీసుకురానున్న ప్రభుత్వం
- నిరుద్యోగ యువతకు శిక్షణతోపాటు రాయితీపై రుణం
అనంతరం ఉబెర్‌ సంస్థలో కొనసాగేలా అవకాశం
 
సాక్షి, హైదరాబాద్‌: నిరుద్యోగ యువతకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్‌ ఎంపవర్‌మెంట్‌ పథకాన్ని తీసుకొస్తోంది. ఈ పథకాన్ని గతేడాది అమలు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ అది దరఖాస్తులతోనే ముగిసింది. తాజాగా 2017–18 వార్షిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆర్థిక సహకార సంస్థలకు స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. ఈ క్రమంలో డ్రైవర్‌ ఎంపవర్‌మెంట్‌ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. జూలై ఒకటి నుంచి లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
 
శిక్షణ తర్వాత రుణం..
డ్రైవర్‌ ఎంపవర్‌మెంట్‌ పథకం కింద లబ్ధి పొందిన వ్యక్తి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ఉండాలని ప్రభుత్వం సూచించింది. దీంతో మార్గదర్శకాల రూపకల్పనలో అధికారులు నిబంధనలు కఠినతరం చేయనున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసి డ్రైవింగ్‌లో వారి ప్రావిణ్యాన్ని తెలుసుకుంటారు. తర్వాత శిక్షణ ఇచ్చి.. రాయితీ రుణంతో కారు కొనుగోలు చేసేలా వెసులుబాటు కల్పిస్తారు. క్యాబ్‌లో నిర్వహించేలా ఉబెర్‌ సంస్థతో ప్రభుత్వం ఒప్పం దం కుదుర్చుకోనుంది. 2016–17 వార్షిక సంవత్సరం చివర్లో ఈ పథకం కింద ఆర్థిక సహకార సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా 21,106  దరఖాస్తులు స్వీకరించాయి. అయితే ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాకపోవడంతోపాటు రాయితీ రుణాలకు సంబంధించి నిధులు విడుదల చేయలేదు.  ఆయా శాఖల అధికారులు వాటి పరిశీలన చేపట్టలేదు. తాజాగా సరికొత్త నిబంధనలు రూపొందిస్తు న్న నేపథ్యంలో యంత్రాంగం కొత్తగా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. 
>
మరిన్ని వార్తలు