బదిలీ జాతర

14 Feb, 2014 03:40 IST|Sakshi
బదిలీ జాతర
  • జంట పోలీస్ కమిషనరేట్లలో..
  •   జోనల్ కాదు..  రెవెన్యూ జిల్లానే యూనిట్
  •   వరుసగా మూడేళ్లు పనిచేస్తే బదిలీనే..
  •   లూప్‌లైన్లలో ఉన్న వారికి మినహాయింపు
  •   పరస్పర మార్పిడి,  ‘పాతవారిని’ పిలిపించే సన్నాహాలు
  •   కసరత్తు చేపట్టిన ఉన్నతాధికారులు
  •  జంట కమిషనరేట్లలో భారీగా ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం
  •  సాక్షి, సిటీబ్యూరో: జంట పోలీస్ కమిషనరేట్లలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు చోటుచేసుకోనున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. వరుసగా మూడేళ్లు పూర్తిచేసుకున్న వారికి బదిలీ తప్పనిసరి కానుంది. బదిలీల వ్యవహారంలో.. ముంబై, బెంగ ళూరు కమిషనరేట్లలో మాదిరిగా జోన్‌ను యూనిట్‌గా చేసుకునే వీలు కల్పించాలని, అంతర్ జోన్ బదిలీలకు అనుమతినివ్వాలని జంట కమిషనరేట్లు చేసిన విన్నపాన్ని ఎన్నికల సంఘం (ఈసీ) తిరస్కరించింది.

    కమిషనరేట్లలోని రెవెన్యూ జిల్లానే యూనిట్‌గా తీసుకోవాలని స్పష్టం చేసింది. గత నాలుగేళ్లలో (2010 మే నుంచి 2014 మే) వరుసగా మూడేళ్ల పాటు ఫోకల్ పోస్టుల్లో పనిచేసిన వారిని కచ్చితంగా కమిషనరేట్ల నుంచి బయటకు పంపాల్సిందేనని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లకు వర్తమానం పంపింది. దీంతో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ స్థాయిలో ఒకేసారి బదిలీలు  చేపట్టనుండటం కమిషనరేట్ల చరిత్రలోనే ఇదే తొలిసారి.
     
    ‘రెవెన్యూ’ యూనిట్‌తో ఇదీ ఇబ్బంది
     
    రెవెన్యూ జిల్లాను యూనిట్‌గా పనిగణిస్తే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి రెండు కమిషనరేట్లూ ప్రత్యేక యూనిట్లుగా మారతాయి. అంటే గడిచిన నాలుగేళ్లలో ఈ కమిషనరేట్లలో మూడేళ్ల పాటు ఫోకల్ పోస్టుల్లో పనిచేసిన ఇన్‌స్పెక్టర్లను కచ్చితంగా బయటకు పంపాల్సి ఉంటుంది. దీనివల్ల కొత్తగా బయటి జిల్లాలు/రేంజ్ నుంచి వచ్చే వారితో ఎన్నికల బందోబస్తు నిర్వహణ కష్టంగా మారుతుందని ఉన్నతాధికారులు భావించారు. అలాకాక జోన్‌ను యూనిట్‌గా తీసుకుంటే రెండు కమిషనరేట్లలోని పది జోన్లలో దేనికది చొప్పుడు మూడేళ్ల పాటు పని చేసిన వారిని వేరే జోన్‌కు బదిలీ చేస్తే సరిపోయేది. ఈ ప్రతిపాదనను ఈసీ తిరస్కరించడంతో కమిషనరేట్ల నుంచి బయటకు పంపాల్సి వస్తోంది.
     
    వీరికి మాత్రమే మినహాయింపు
     
    ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండే శాంతి భద్రతల విభాగంతో పాటు ట్రాఫిక్, డిటెక్టివ్ విభాగాలను ఫోకల్ పోస్టింగ్స్‌గా ఎన్నికల సంఘం నిర్దేశించింది. వీటిలో పనిచేస్తున్న అధికారులకు నిర్దేశిత మూడేళ్లు పూర్తయితే కమిషనరేట్ విడిచి వెళ్లాల్సిందే. ఇవికాకుండా కంప్యూటరైజేషన్, స్పెషల్ బ్రాంచ్, పోలీసు ట్రైనింగ్ కాలేజీ, జిల్లా ట్రైనింగ్ కాలేజీ వంటి శిక్షణ సంస్థలు, పోలీసు కంట్రోల్ రూమ్, క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలు, టాస్క్‌ఫోర్స్‌లో పని చేస్తున్న, పని చేసి బయటకు వచ్చి మూడేళ్లు కాని వారితో పాటు వెయిటింగ్‌లో ఉన్న వారికి మినహాయింపునిచ్చింది. వీటిని ప్రజలతో నేరుగా సంబంధాలు లేని లూప్‌లైన్లుగా పరిగణించారు. గతంలో జరిగిన ఎన్నికల సందర్భంలో నియోజకవర్గాలను పరిధిగా తీసుకుని మూడేళ్లు, స్థానికతలను నిర్దేశించారు. అయితే ప్రస్తుతం దీనికి పూర్తి భిన్నంగా కమిషనరేట్/రెవెన్యూ జిల్లా యూనిట్‌గా మారింది.
     
    భారీ కసరత్తు చేపట్టిన అధికారులు
     
    తాజా పరిణామంతో రెండు కమిషనరేట్లలోనూ భారీగా బదిలీలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. సరాసరిన సైబరాబాద్ కమిషనరేట్ నుంచి 43 మంది, సిటీ నుంచి దాదాపు 70 మంది బయటికు బదిలీ కావాల్సి ఉంది. ఈ స్థాయిలో రెండు కమిషనరేట్లలోకి కొత్త అధికారులు, స్థానిక పరిస్థితులపై అవగాహన లేని వారు వస్తే బందోబస్తు నిర్వహణ కష్టంగా మారుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనికి పరిష్కారంగా బదిలీ చేయాల్సిన అధికారుల తుది జాబితాలు రెండ్రోజుల్లో రూపొందించిన తరవాత ఇద్దరు కమిషనర్లు హైదరాబాద్ రీజియన్ ఐజీతో భేటీ కావాలని నిర్ణయించారు.

    నియోజకవర్గాల స్థానికత ఇబ్బందులు రాకుండా కమిషనరేట్లలో అధికారుల పరస్పర మార్పిడితో పాటు గతంలో ‘ఐదేళ్ల నిబంధన’ కారణంగా కమిషనరేట్ల నుంచి రీజియన్‌కు వెళ్లిన వారిని వెనక్కు తీసుకురావాలని భావిస్తున్నారు. దీనివల్ల అనుభవం ఉన్న అధికారుల్ని అవకాశం ఉన్న చోట్ల నియమించుకోవచ్చు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు సహా ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో రెండుమూడు రోజుల్లో బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని, లేదంటే తొలి విడతలో ఠాణాల్లో పని చేస్తున్న ఇన్‌స్పెక్టర్ల బదిలీలు చేపట్టాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
     

>
మరిన్ని వార్తలు