ఐదేళ్ల సర్వీసు ఉంటే బదిలీ చేయాలి

11 Apr, 2018 02:17 IST|Sakshi

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉద్యోగ సంఘాల జేఏసీ విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలు, పదవీ విరమణ వయస్సు పెంపు, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) రద్దు వంటి ప్రధాన అంశాల్లో ప్రభుత్వం ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ విన్నవించింది. వాటి పై ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకోకపోతే పోరాట కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొంది.

ఈ మేరకు మంగళవారం జేఏసీ నేతలు రవీందర్‌రెడ్డి, మమత, మధుసూదన్‌రెడ్డి, రాజేందర్, సత్యనారాయణ తదితరులు సీఎస్‌ను సచివాలయంలో కలసి వినతిపత్రం సమర్పించారు. గతంలోనే ఉద్యోగులకు సంబంధించిన 18 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచిన జేఏసీ.. ఆయా అంశాల వారీ వివరాలను, వాటికి సంబంధించిన ఉత్తర్వుల కాపీలను సీఎస్‌కు మంగళవారం అందజేశారు.  

సీపీఎస్‌ రద్దుపై పట్టు
ప్రధానంగా సీపీఎస్‌ను రద్దు చేయాలని జేఏసీ సభ్యులు సీఎస్‌ను కోరారు. సీపీఎస్‌లో చేరినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించాలని, సీపీఎస్‌ నుంచి వైదొలుగుతున్నట్లు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని, పాత పెన్షన్‌ స్కీంను పునరుద్ధరించాలని పేర్కొన్నారు. అలాగే ఐదేళ్ల సర్వీసున్న ప్రతి ఉద్యోగి బదిలీకి అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

గతంలో ఉన్నట్లుగా 20 శాతం మందికే బదిలీలు కాకుండా అర్హత ఉన్న అందరి బదిలీలకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రెండేళ్ల సర్వీసున్న వారికి కూడా బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ బదిలీలను కూడా పాత పది జిల్లాల ప్రాతిపదికనే చేపట్టాలని, ఇందుకు కౌన్సెలింగ్‌ విధానం తెచ్చి, ఉద్యోగుల అభిప్రాయాల మేరకు బదిలీలు చేయాలని సూచించారు.

అలాగే పదోన్నతులు ఇవ్వాలని, ఇందుకు రెండేళ్ల సర్వీసును ప్రాతిపదికగా తీసుకోవాలని జేఏసీ ప్రతినిధులు కోరారు. రిటైర్‌మెంట్‌ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని, వెంటనే 11వ పీఆర్‌సీని ఏర్పాటు చేయాలని కోరారు. డిమాండ్లపై సీఎం కేసీఆర్‌తో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎస్‌ చెప్పినట్లు జేఏసీ నేతలు వివరించారు.

మరిన్ని వార్తలు