పండక్కి పిండుకుంటున్నారు!

7 Jan, 2016 04:41 IST|Sakshi
పండక్కి పిండుకుంటున్నారు!

     ► ప్రైవేట్ ఆపరేటర్ల అడ్డగోలు దందా
     ► తత్కాల్ పేరిట నిలువు దోపిడీ
     ► రెండు, మూడు రెట్లు అధికంగా బాదుడు
     ► క్యాబ్‌లు, కార్ల అద్దెలు చుక్కల్లో
     ► రూ. 100 కోట్లు దండుకునేందుకు సిద్ధం
     ► ప్రయాణమంటే హడలిపోతున్న జనం
 
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలో పండుగ ప్రయాణం మరింత ప్రియం కానుంది. ఈ సీజన్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ పంట పండుతోంది. ట్రావెల్స్ యాజమాన్యాలు తత్కాల్ పేరిట నిలువు దోపిడీకి తెర తీశాయి. ప్రయాణికుల రద్దీని బట్టి ఆర్టీసీ కూడా ఇష్టమొచ్చినట్లు టిక్కెట్ల ధరలు పెంచుకునేందుకు వీలుగా ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి సర్కారు పరోక్షంగా సహకరిస్తోంది. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడుపుతామని ప్రకటించి వాటిని నడపకపోవడంతో ప్రయాణికులు గత్యంతరం లేక ప్రైవేట్ బస్సులను ఆశ్రయించాల్సి వస్తోంది.


హైదరాబాద్‌లో ఉంటున్న సచివాలయ ఉద్యోగి రామసుబ్బారావు సంక్రాంతి పండుగకు విజయనగరం జిల్లా సాలూరు వెళ్లేందుకు పది రోజుల ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుందామనుకుని ఆర్టీసీ కౌంటర్‌కు వెళ్లగా, టిక్కెట్లు లేవని చెప్పడంతో ప్రైవేట్ ఆపరేటర్లను ఆశ్రయించాడు. వారు ముందస్తు రిజర్వేషన్లు బ్లాక్ చేశారు. డిమాండ్‌ను బట్టి చార్జీ ఉంటుందని చెప్పడంతో విశాఖపట్నం వరకు నాన్ ఏసీ టిక్కెట్టు రూ.1,900 పెట్టి కొనక తప్పలేదు.


ప్రైవేట్ బస్సుల చార్జీలు మండిపోతుండడంతో మరో ఉద్యోగి వేణుగోపాలరావు తన కుటుంబంతో కలిసి సొంతూరు కృష్ణా జిల్లా గుడివాడకు క్యాబ్‌లో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. క్యాబ్ అద్దె రూ.17 వేలు, డ్రైవర్ బత్తా, ఇతరాలన్నీ కలిపి రూ.20 వేలకు తక్కువ కాదని చెప్పడంతో చేసేదేమీ లేక డబ్బులు చెల్లించి, బుక్ చేసుకున్నాడు.


రూ.100 కోట్లు దండుకునే ఎత్తుగడ
సాధారణ రోజుల్లో ప్రైవేట్ ఆపరేటర్లు రోజుకు దాదాపు రూ.5 కోట్లు వ్యాపారం సాగిస్తారు. క్రిస్మస్ సీజన్ నుంచి సంక్రాంతి ముగిసేవరకు చార్జీలను రెండు మూడు రెట్లు పెంచేసి రూ.100 కోట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సంక్రాంతి సీజన్‌లో ముందస్తు రిజర్వేషన్లను నిలిపివేసి, తత్కాల్ విధానానికి తెర తీశారు. డిమాండ్‌కు సొమ్ము చేసుకొనేందుకు ప్రణాళిక రచించారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు నాన్ ఏసీ ధర సాధారణ రోజుల్లో రూ.600 ఉంటే, గతేడాది సంక్రాంతి సీజన్‌లో రూ.1,800 వసూలు చేశారు. ఇప్పుడు ఈ అడ్డగోలు వసూలుకు తత్కాల్ ధర అని ముద్దు పేరు పెట్టారు. డిమాండ్‌ను బట్టి రూ.2,500 పైగా వసూలు చేసేందుకు నిర్ణయించారు. ఇక ఏసీ ధర సాధారణ రోజుల్లో రూ.1,000 కాగా, గత సంక్రాంతి సీజన్‌లో రూ.2,600 వసూలు చేశారు. ఈసారి రూ.3,000 పైగానే దండుకొనే పరిస్థితి కనిపిస్తోంది.
 

క్యాబ్‌లను కదిలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే
 కుటుంబ సమేతంగా ప్రయాణం చేసేవారు ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి భయపడి క్యాబ్‌లు, కార్లను ఆశ్రయిద్దామనుకుంటే వాటి ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు క్యాబ్‌లో వెళ్లాలనుకుంటే కిలోమీటర్‌కు రూ.5 నుంచి రూ.10 వరకు అదనంగా ధర నిర్ణయిస్తున్నారు. డ్రైవర్ బత్తా సాధారణంగా రోజుకు రూ.100 నుంచి రూ.200 ఉంటే, ఈ సీజన్‌లో రూ.2,000 నుంచి రూ.3,000 వేల వరకు చెబుతున్నారు.  
 

అడ్డుకోండి చూద్దాం
రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు చెలరేగిపోతున్నాయి. రోడ్లపై తమ బస్సులను ఆపే దమ్ము ఎవరికీ లేదన్న రీతిలో వ్యవహరిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలకు ప్రముఖ ట్రావెల్స్ సంస్థలుండడంతో రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ బస్సులను తనిఖీ చేయాలంటే జంకుతున్నారు. ప్రైవేట్ బస్సుల చార్జీలను కట్టడి చేసే అధికారం తమకు లేదని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పడం గమనార్హం. ప్రైవేట్ ఆపరేటర్లు అధిక చార్జీలను వసూలు చేస్తే సీజ్ చేస్తామని బీరాలు పలికిన ప్రభుత్వం గత ఏడాదిన్నర కాలంలో ఒక్క బస్సును కూడా సీజ్ చేయలేదు. ఒక్క కేసూ నమోదు చేసిన పాపాన పోలేదంటే వారికి ప్రభుత్వం ఎంతగా సహకరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.
 
 
 

మరిన్ని వార్తలు