కార్బైడ్ ఎలా దొరుకుతోందో తేల్చండి

7 Jun, 2016 04:13 IST|Sakshi
కార్బైడ్ ఎలా దొరుకుతోందో తేల్చండి

- ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
- లభ్యం కాకుండా చూస్తే తప్ప వినియోగాన్ని అరికట్టలేం
విచారణ 8కివాయిదా
 
 సాక్షి, హైదరాబాద్: కాయలను పక్వానికి తీసుకొచ్చేందుకు వ్యాపారులు వినియోగిస్తున్న కార్బైడ్ అసలు వారికి ఎలా లభ్యమవుతోందో తేల్చాలని హైకోర్టు సోమవారం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. కార్బైడ్ లభ్యం కాకుండా చూస్తే తప్ప, వినియోగాన్ని అరికట్టడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కార్బైడ్ రవాణా చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని, ఈ దిశగా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల(ఎఫ్‌ఎస్‌ఓ) పోస్టుల భర్తీకితగిన చర్యలు చేపట్టడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడింది. ఎఫ్‌ఎస్‌ఓల ఖాళీలను భర్తీ చేస్తామని గతంలో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది.

ఎందుకు భర్తీ చేయడం లేదో వ్యక్తిగతంగా హాజరై వివరించాలని ఏపీ వైద్య విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పండ్ల వ్యాపారులు కాయలను పక్వానికి తీసుకొచ్చేందుకు కార్బైడ్‌ను వినియోగిస్తున్న తీరుపై పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది.

 ఎఫ్‌ఎస్‌ఓ పోస్టుల భర్తీ విషయంలో ఏపీ సర్కార్‌పై మండిపాటు
 కోర్టు సహాయకారి(అమికస్ క్యూరీ)గా వ్యవహరిస్తున్న న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, కార్బైడ్ వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ 2 నెలల్లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. ఏపీ సర్కార్ ఎఫ్‌ఎస్‌ఓ పోస్టుల భర్తీనీ పట్టించుకోవడం లేదని, ఏపీ, తెలంగాణలో ఎఫ్‌ఎస్‌ఓల సంఖ్య తక్కువగా ఉందంటూ వివరించారు. ఎఫ్‌ఎస్‌ఓల భర్తీకి తీసుకుంటున్న చర్యలపై ఇరు ప్రభుత్వాలను వివరణ కోరింది. తెలంగాణ తరఫున ప్రత్యేక న్యాయవాది ఎస్.సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో ప్రస్తుతం 20 మంది ఎఫ్‌ఎస్‌ఓలున్నారని, మరో 23 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ చర్యలు చేపట్టనుందన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేకన్యాయవాది డి.రమేష్ స్పందిస్తూ, ఏపీలో ప్రస్తుతం 28మంది ఎఫ్‌ఎస్‌ఓలు ఉన్నారని, మరికొన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపామన్నారు. వాదనలపై అసంతృప్తి వ్యక్తంచేసిన ధర్మాసనం, పోస్టుల భర్తీకి ప్రతీసారి గడువు కోరుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ విచారణను 8కు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు