హర్షితకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి లక్ష్మారెడ్డి

15 Jul, 2016 17:56 IST|Sakshi

హైదరాబాద్ : కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్సకు డబ్బులు లేక మెర్సీ కిల్లింగ్‌కు అనుమతించాలని కోరుతూ హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన బాధితురాలు హర్షిత(11)కు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. హర్షితకు శస్త్రచికిత్స చేసేందుకు ఓ కార్పొరేట్ ఆస్పత్రి ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు. అందుకోసం ఆరోగ్యశ్రీ నుంచి రూ.10.50 లక్షలు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని విరంచి ఆస్పత్రి రూపొందించిన వి కనెక్ట్ విరంచి మొబైల్ యాప్ను శుక్రవారం మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు.

ఆరోగ్య రాజధానిగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌ నగరంలో అధునాతన హంగులతో 600 పడకల సామర్థ్యంతో ఈ ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని విరంచి ఆసుపత్రి యాజమాన్యాన్ని కొనియాడారు. ఇదిలా ఉంటే మంత్రి విజ్ఞప్తికి విరంచి ఆస్పత్రి చైర్మన్ విష్ కొంపెల్లా స్పందించారు.

సామాజిక సేవలో భాగంగా తమ ఆస్పత్రిలో ప్రతి నెలా ఒకరికి ఉచితంగా అవయవ మార్పిడి శస్త్ర చికిత్స చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. తమ ఆస్పత్రిలో మరో నెల రోజుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు ప్రారంభమవుతాయన్నారు.ఈ కార్యక్ర మంలో చైర్ పర్సన్ మాధవీలత కొంపెల్లా, సీఎంవో శ్రీనివాస్ మైన, మెడికల్ డెరైక్టర్ ఎన్‌ఎస్‌వీవీ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు