టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌

8 Mar, 2017 01:32 IST|Sakshi
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌

ఎమ్మెల్యే కోటాలో కృష్ణారెడ్డి, ఉళ్లోల్ల, మైనంపల్లి నామినేషన్లు దాఖలు
వీరి ఎన్నిక ఏకగ్రీవమే
10న లాంఛనంగా ప్రకటన


సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ్యుల కోటాలో టీఆర్‌ఎస్‌ పక్షాన నామినేషన్లను దాఖలు చేసిన ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఉళ్లోల్ల గంగాధర్‌గౌడ్, మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. ఈ కోటాలో ఖాళీ అయిన మూడు స్థానాలకు గడువు ముగిసే సమయానికి మూడు నామినేషన్లే దాఖలయ్యాయి. బుధవారం వీరి నామినేషన్లు పరిశీలిస్తారు. ఈ నెల 10న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక, సాయంత్రం 3 గంటలకు వీరు ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ప్రకటించి, సర్టిఫికెట్లను అందజేయడం లాంఛన ప్రాయమే. మంగళవారం శాసనసభ కార్యదర్శి రాజా సదారాంకు కృష్ణారెడ్డి, హనుమంతరావు, గంగాధర్‌గౌడ్‌ నామినేషన్‌న్లు సమర్పించారు.

ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, కేటీఆర్, పద్మారావుగౌడ్, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు కల్వకుంట్ల కవిత, మల్లారెడ్డి, చీఫ్‌ విప్‌లు కొప్పుల ఈశ్వర్, పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ప్రశాంత్‌రెడ్డి, పాషాఖాద్రీ, శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాలరాజ్, రవీంద్రకుమార్, మేయర్‌ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్, పలువురు నగర కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు గన్‌ పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్సీ అభ్యర్థులు నివాళులర్పించారు.

బురద జల్లడమే విపక్షాల లక్ష్యం: నాయిని
కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా పని చేస్తున్నాయని హోంమంత్రి నాయిని ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి బుడ్డర్‌ఖాన్‌లా మాట్లాడుతున్నాడని, మంత్రులపై ఆరోపణలు చేస్తే మీడియాలో వార్తలు వస్తాయని అదే పనిగా అబద్ధాలు చెపుతున్నాడని మండిపడ్డారు. తెలంగాణలో టీడీపీ లేదని, ఉత్తమ్‌ ఉత్తుత్తి మాటలు మాట్లాడుతున్నారని, ఆ మాటలు నమ్మి దిగ్విజయ్‌ తన స్థాయిని దిగజార్చుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ వైఖరి ఇలాగే ఉంటే ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయమన్నారు.

ఇప్పటికైనా విపక్షాలు బుద్ది తెచ్చుకుని అనవసర విమర్శలు మాని ప్రజలతో ఉంటూ, అభివృద్ధికి సహకరిస్తే మంచిదని హితవు పలికారు. ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు, గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలు రాబోతుండడంతో మండలిలో టీఆర్‌ఎస్‌ బలం మరింత పెరుగుతుందన్నా రు. దేశంలో ఏ ముఖ్యమంత్రికీ లేని ఆదరణ కేసీఆర్‌కు ఉందని, ఎన్నికల మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తున్నది టీఆర్‌ఎస్‌ ఒక్కటేనని చెప్పారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చౌరస్తాలో ప్రజల సమక్షంలో చర్చకు సిద్ధమేనని ప్రతిపక్షాలకు నాయిని సవాల్‌ విసిరారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా