పెద్దల సభకు కెప్టెన్, డీఎస్

27 May, 2016 01:09 IST|Sakshi
పెద్దల సభకు కెప్టెన్, డీఎస్

రాజ్యసభకు టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఖరారు
కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి. శ్రీనివాస్‌ల పేర్లు ప్రకటన
ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఫరీదుద్దీన్
రాజ్యసభ ఎన్నికల పర్యవేక్షకులుగా ఈటల, నాయిని
 
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్‌లో ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు పార్టీ నాయకత్వం ఇద్దరు అభ్యర్థుల పేర్లను గురువారం ప్రకటించింది. పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులతో బుధ, గురువారాల్లో సంప్రదింపులు జరిపాక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభ్యర్థులను నిర్ణయించారు. రాజ్యసభ సభ్యులుగా కెప్టెన్ వడితెల లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) పోటీ చేస్తారని ప్రకటించారు. అలాగే మిగతా
 మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి ఎండి ఫరీదుద్దీన్‌ను పార్టీ అభ్యర్ధిగా ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికలకు పర్యవేక్షకులుగా మంత్రులు ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి వ్యవహరిస్తారని టీఆర్‌ఎస్ నాయకత్వం ప్రకటించింది.
 
ఉత్కంఠకు తెర
రాజ్యసభ ఎన్నికల షెడ్యూలు విడుదలైనప్పటి నుంచే టీఆర్‌ఎస్ ఆశావహుల్లో సందడి మొదలైంది. పార్టీ చేతిలో ఏకంగా 88 మంది ఎమ్మెల్యేలు ఉండటం, విపక్షాలు పోటీ చేసే అవకాశం దాదాపు లేకపోవడం వల్ల అధికార పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో టీఆర్‌ఎస్‌లోని పలువురు సీనియర్లు అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌లతోపాటు పార్టీ కోశాధికారిగా పనిచేసిన దామోదర్‌రావు, పారిశ్రామికవేత్త సీఎల్ రాజం వంటి వారు రాజ్యసభ సీటు కోసం ప్రయత్నించారు.
 
నామినేషన్ల దాఖలుకు ఈనెల 31 చివరి తేదీ కావడంతో అధినేత ఎవరి పేర్లను ప్రకటిస్తారోననే సస్పెన్స్ కొనసాగింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌కు చేరుకొని కున్నాక సీఎం కేసీఆర్ రెండు రోజులపాటు పలువురు సీనియర్ల అభిప్రాయం తీసుకొని అభ్యర్థులను ఖరారు చేశారు. అలాగే ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానంపైనా మరో చర్చకు అవకాశం లేకుండా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఫరీదుద్దీన్ పేరును ప్రకటించి ఈ వ్యవహారానికి తెరదించారు.
 
కేసీఆర్‌కు కృతజ్ఞతలు: కెప్టెన్ లక్ష్మీకాంతరావు
రాజ్యసభ టికెట్ రావడం సంతృప్తి కలిగిస్తోంది. నాకు అవకాశం ఇచ్చినందుకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. తెలంగాణ అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తా. బంగారు తెలంగాణ సాధన కోసం పనిచేస్తా.
 
రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తా: డీఎస్
రాజ్యసభ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డి.శ్రీనివాస్ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తానని ప్రకటించారు. రాజ్యసభ అభ్యర్థిగా తన పేరు ప్రకటించాక డీఎస్ గురువారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తానని, ఢిల్లీకి వెళ్లి సేవ చేసే అవకాశాన్ని కేసీఆర్ తనకు ఇచ్చారన్నారు. ఢిల్లీలో తనకున్న పరిచయాలతో రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతానన్నారు. పార్టీ మారినప్పుడు చాలా మంది తనకు భవిష్యత్తు సరిగా ఉండదన్నారని గుర్తుచేసిన డీఎస్...పార్టీలో పనిచేసే నేతలకు పదవులు వస్తాయన్నారు.

మరిన్ని వార్తలు