టీఆర్ఎస్ జాబితా మతలబేంటి

18 Jan, 2016 16:28 IST|Sakshi
టీఆర్ఎస్ జాబితా మతలబేంటి

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు వస్తాయి. మెజారిటీ వస్తే ఎవరు మేయర్ పీఠాన్ని చేపడుతారు. ఇలాంటి విషయాలపై ఇటు రాజకీయవర్గాల్లో అటు ప్రజల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల విషయం ఎలా ఉన్నా టీఆర్ఎస్ తరఫున విడుదల చేసిన జాబితాలపై ఇప్పుడు అన్ని వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ దారితీసింది. టీఆర్ఎస్ జాబితాల్లోని ఇద్దరు పేర్లు మేయర్ అభ్యర్థులుగా ప్రచారం జరుగుతోంది.

ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మొదట టీఆర్ఎస్ విడుదల చేసింది. వరుస పరంపరగా అభ్యర్థుల జాబితాలను రిలీజ్ చేయగా.... అలా విడుదల చేసిన జాబితానే తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీఆర్ఎస్ విడుదల చేసిన జాబితాలోని అభ్యర్థులందరి సామాజిక నేపథ్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కానీ ఇద్దరు అభ్యర్థుల విషయంలో పార్టీ విడుదల చేసిన జాబితాలో వారి సామాజిక నేపథ్యమేమిటన్నది పొందుపరచలేదు. అదే అంశం ఇప్పుడు కీలక చర్చకు ఆస్కారమిచ్చింది. దీనిపైనే ఇప్పుడు రకరకాల ఊహాగానాలకు తెరలేపింది.

చివరి రోజున చెర్లపల్లి డివిజన్ నుంచి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన బొంతు రామ్మోహన్, బంజారాహిల్స్ డివిజన్ నుంచి నామినేషన్ వేసిన గద్వాల్ విజయలక్ష్మి పేరు చివరన బీసీ అని పేర్కొన్నారే గానీ వారి సామాజిక నేపథ్యం వివరించలేదు. అన్ని జాబితాల్లో అభ్యర్థుల సామాజిక నేపథ్యం మొత్తం వివరించి ఈ రెండు పేర్ల విషయంలో ఎందుకు వివరాలివ్వలేదన్నది ప్రశ్న. అలా ఇవ్వకపోవడంతో వారిద్దరిలో ఒకరు మేయర్ అభ్యర్థి అవుతారని, ఆ కారణంగానే సామాజిక నేపథ్యం పొందుపరచలేదన్న ప్రచారం షికార్లు చేస్తోంది. బొంతు రామ్మోహన్ మొదటి నుంచి టీఆర్ఎస్లో కొనసాగుతుండగా, విజయలక్ష్మి టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కుమార్తె.

మరిన్ని వార్తలు