అద్దెబస్సు ‘ముంచుతోంది’

22 May, 2016 03:00 IST|Sakshi
అద్దెబస్సు ‘ముంచుతోంది’

ఈ ఏడాది నష్టాలు...
గ్రేటర్ ఆర్టీసీకి  లభించిన ఆదాయం  
రూ.1330.47 కోట్లు
బస్సుల నిర్వహణకు చేసిన ఖర్చు 
రూ.1685.15 కోట్లు
నష్టం  రూ.354.75 కోట్లు

సాక్షి, సిటీబ్యూరో:  మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు  తీవ్ర నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్ ఆర్టీసీపై అద్దె బస్సులు పిడుగుపాటుగా మారాయి. వాటిపై వచ్చే ఆదాయం కంటే చెల్లించే అద్దె భారంగా పరిణమించింది. కొత్త బస్సులు కొనలేని  స్థితిలో ప్రైవేట్ వ్యక్తుల నుంచి అద్దెకు తీసుకొని నడుపుతున్న  462 బస్సులపై  గ్రేటర్ ఆర్టీసీ  ఈ ఏడాది రూ.80 కోట్లు  అద్దె  రూపంలో చెల్లించింది. కానీ ఆ  బస్సుల నిర్వహణ ద్వారా ఆర్టీసీకి లభించిన ఆదాయం మాత్రం కేవలం రూ.58 కోట్లు కావడం గమనార్హం. అంటే ఒక్క ఏడాది కాలంలోనే వచ్చిన ఆదాయం కంటే అదనంగా  రూ.22 కోట్లు  చెల్లించాల్సి వచ్చింది.

నిత్యం పొదుపు మంత్రం పాటించే ఆర్టీసీ  అద్దె బస్సులపై కోట్లాది రూపాయాలు అదనంగా చెల్లించడం చర్చనీయాంశంగా మారింది. అద్దె డబ్బుతో 150 కొత్త బస్సులు సొంతంగా సమకూర్చుకునే అవకాశం ఉండేది. కేవలం ప్రైవేట్ ఆపరేటర్ల స్వలాభం కోసమే  ఆర్టీసీ యాజమాన్యం బస్సులను అద్దెకు తీసుకుంటోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  గ్రేటర్ ఆర్టీసీ  నష్టాలు  ఈ ఏడాది రూ.354.75 కోట్లకు చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రూ.701 కోట్ల నష్టాలు నమోదు కాగా, ఒక్క గ్రేటర్ ఆర్టీసీలోనే సగానికిపైగా నష్టాలు రావడం గమనార్హం.

 అద్దె బస్సులకు పొదుపు మంత్రం వర్తించదా....
గ్రేటర్ జోన్‌లోని 28 డిపోల ద్వారా  ప్రతి రోజు  3550 బస్సులు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. 462 బస్సులను రెండు దఫాలుగా అద్దెకు తీసుకున్నారు. మొత్తం  1050 కి పైగా రూట్లలో ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్సులు రోజుకు 220 నుంచి 300 కిలోమీటర్ల వరకు తిరుగుతాయి. అద్దె బస్సులు తిరిగే రూట్లు, బస్సుల కండిషన్ దృష్ట్యా  ఒక కిలోమీటర్‌కు  రూ.18 నుంచి రూ.22 చొప్పున ఆర్టీసీ చెల్లిస్తుంది. అయితే ఈ బస్సుల నిర్వహణ ద్వారా  ఒక కిలోమీటర్‌పై ఆర్టీసీకి వచ్చే ఆదాయం  పట్టుమని రూ.10 కూడా ఉండడం లేదు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా