టీడీపీకి తాళం!

15 May, 2016 10:21 IST|Sakshi
టీడీపీకి తాళం!

- టీఆర్ఎస్ లో విలీనం చేసే యోచనలో పార్టీ తెలంగాణ  నాయకత్వం
- త్వరలో ఎన్నికల కమిషన్ కు లేఖ ఇచ్చే అవకాశం

- గులాబీ కండువా కప్పుకోనున్న అయిదారు జిల్లాల అధ్యక్షులు
- టీఆర్ఎస్ అధినేతతో ఇప్పటికే తెలంగాణ టీడీపీ ముఖ్యనేత మంతనాలు
- తనతోపాటు వచ్చే నేతల భవిష్యత్పై చర్చలు

 
సాక్షి, హైదరాబాద్:
తెలంగాణలో త్వరలో తెలుగుదేశం పార్టీ తెరమరుగు కానుందా..? ఇప్పటికే టీటీడీపీ శాసనసభాపక్షం టీఆర్ఎస్లో విలీనమై ఇచ్చిన షాక్ నుంచి కోలుకోకముందే పార్టీ నాయకత్వానికి మరో దిమ్మతిరిగే షాక్ తగలనుందా? అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు టీటీడీపీని అధికార టీఆర్ఎస్ లో విలీనం చేసే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. వినడానికి ఇది ఒకింత ఆశ్చర్యమైనా.. అతి త్వరలోనే తెలంగాణ తెలుగుదేశం శాఖను టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నామని పేర్కొంటూ ఎన్నికల సంఘానికి లేఖ ఇవ్వడానికి టీటీడీపీ నాయకత్వం పావులు కదుపుతోంది.

పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ శాఖను ఏమాత్రం పట్టించుకోకపోవడం, పార్టీ ఇక్కడ బతికి బట్టకట్టడం, భవిష్యత్ ప్రశ్నార్థకం కావడం వంటి అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం జరిగిందని తెలుస్తోంది. ఇప్పటికే టీటీడీపీ నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేల్లో 12 మంది టీఆర్ఎస్ గూటికి చేరారు. అక్కడితో ఆగకుండా తెలంగాణ టీడీపీ శాసన సభాపక్షాన్ని టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో విలీనం చేయాలంటూ స్పీకర్‌ లేఖ రాశారు. స్పీకర్ ఇప్పటికే విలీనం తంతును ముగించి, ఆ మేరకు వీరందరికీ అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిపి సీట్లు కూడా కేటాయించారు. టీ టీడీఎల్పీ విలీనం జరిగిపోగా.. ఇప్పుడు పార్టీ రాష్ట్ర శాఖ వంతు వచ్చినట్లు చెబుతున్నారు.

లేదు.. లేదంటూనే..!
పార్టీకి మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరడానికి నాయకత్వంతో మంతనాలు జరిపారని, బయటకు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నా ఆయన చేరిక ఖరారైనట్లు సమాచారం. అలాగే టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ సైతం తాను పార్టీ మారడం లేదని అంటున్నా.. ఆయన చేరికపై ప్రచారం మాత్రం ఆగడం లేదు. పార్టీ వర్గాలు సమాచారం మేరకు టీటీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్, మరికొద్ది మంది నాయకులే మిగిలే అవకాశం ఉందంటున్నారు.

ఇప్పటికే పలువురు పార్టీ నేతలు టీఆర్ఎస్ బాట పట్టారు. మిగిలిన వారిలో కనీసం అయిదారు జిల్లాల అధ్యక్షులు, జిల్లా నేతలు, రాష్ట్ర కార్యవర్గంలో వివిధ పదవులు, హోదాల్లో ఉన్న నేతలు సైతం మూకుమ్మడిగా టీఆర్ఎస్లో చే రే యోచనలో ఉన్నట్లు తెలిసింది. తెలంగాణ టీడీపీ ముఖ్య నేత ఒకరు ఈ మేరకు ఇప్పటికే అధికార పార్టీ అధినేతతో మంతనాలు జరిపారని తెలిసింది. తనతో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గంలో వివిధ పదవుల్లో కొందరు నేతలు చేరతారని, వారి భవిష్యత్ మాటేమిటన్న చర్చ కూడా జరిగినట్లు తెలిసింది.

విలీన సమయంలోనే సిద్ధమయ్యారట!
వాస్తవానికి టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ఎల్పీలో విలీనమైన సమయంలోనే ఆయా ఎమ్మెల్యేలతో పలువురు జిల్లాల నాయకులు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని, అయితే ఇప్పుడే వారందరినీ తీసుకువెళ్లి, ఎలా సర్దుబాటు చేయించాలో తెలియక ఆగిపోయారని చెబుతున్నారు. ‘‘జిల్లాల శాఖలన్నీ మూకుమ్మడిగా పార్టీ మారేందుకు, టీఆర్ఎస్లో చేరేందుకు ముందుకు వచ్చారు. కానీ వారికి ఏ పదవులు ఇప్పించగలుగుతాం. వారిని ఎలా సర్దుబాటు చేస్తాం అన్న ప్రశ్నలతో మేమే వెనుకగడుగు వేశాం..’’ అని సీనియర్ ఎమ్మెల్యే ఒకరు ‘సాక్షి’కి చెప్పారు.

ఇప్పటికే వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసలు పెరిగినా.. టీడీపీ నుంచే ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు గులాబీ గూటికి చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణ శాఖ గురించి అంత సీరియస్గా పట్టించుకోక పోవడం, టీటీడీపీలో ఒక నాయకుడిదే ఇష్టారాజ్యం కావడం, జిల్లాల్లోని స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు టీఆర్ఎస్ పంచన చేరడం తదితర పరిణామాల నేపథ్యంలో ఇక పార్టీ మనుగడ కష్టమన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే పార్టీని విలీనం చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు