రైతు సమస్యలపై టీడీపీ పోరుయాత్ర

5 Nov, 2016 02:50 IST|Sakshi
రైతు సమస్యలపై టీడీపీ పోరుయాత్ర

సాక్షి, హైదరాబాద్: రైతు సమస్యలపై తెలంగాణ టీడీపీ సమరశంఖం పూరించడానికి సిద్ధమైంది. రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని, సమగ్ర వ్యవసాయ విధానం ప్రకటించాలని, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్లతో మినీ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఆదివారం భూపాలపల్లిలో పాదయాత్రతో పోరు ప్రారంభించనుంది. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి నేతృత్వంలో పాదయాత్ర ఉదయం ప్రారంభమై, సాయంత్రం కలెక్టరేట్ వద్ద నిరసన, బహిరంగ సభతో ముగుస్తుంది.

అలాగే 9న ఖమ్మం, 12న పెద్దపల్లి, 13న మద్దూర్ (కొడంగల్), 15న సూర్యాపేటలో పాదయాత్ర, నిరసనసభ, 30న కొడంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ప్రకృతి వైపరీత్యాలవల్ల నష్టపోయిన రైతును ఆదుకోకపోగా.. రుణమాఫీ వంటి హామీలను ప్రభుత్వం అమలు చేయకపోవడంవల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. 90శాతం దళిత, గిరిజన, పేద వర్గాలు  వ్యవసాయంపై ఆధారపడ్డాయని, వారిలో భరోసా నింపడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.
 

మరిన్ని వార్తలు