పసిడిని కాజేయబోయి పట్టుబడ్డారు

16 Sep, 2017 03:48 IST|Sakshi
పసిడిని కాజేయబోయి పట్టుబడ్డారు
ముగ్గురు రైల్వేకూలీలు, ఇద్దరు ఆటోడ్రైవర్ల రిమాండ్‌
 
హైదరాబాద్‌: బంగారు బిస్కెట్లను కాజేయబోయిన ఐదుగురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటన హైదరాబాద్‌ కాచిగూడ రైల్వేస్టేషన్‌లో జరిగింది. ఈ నెల 13న రాత్రి 11 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్‌లో రైళ్లు, ప్లాట్‌ఫామ్‌లు, ప్రయాణికుల లగేజీలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. భయంతో వణికిపోయిన ఓ గుర్తుతెలియని వ్యక్తి తన నడుంకున్న బెల్టును రైల్వేస్టేషన్‌ ప్రవేశద్వారం ముందు వదిలేశాడు. దానిని ఎనకపల్లి రామకృష్ణ అనే రైల్వే కూలి గుర్తించాడు. బెల్టును తెరిచిచూడగా అందులో బంగారు బిస్కెట్లు కనిపించాయి. దీనిని మరో ఇద్దరు రైల్వేకూలీలు గడ్డం నరేశ్, దొడ్డి అంజయ్య కనిపెట్టారు.

ముగ్గురూ ఒక కలసి పంచుకోవాలని నిర్ణయించు కున్నారు. సమీపంలోని ఆటోస్టాండ్‌కు వెళ్లి బంగారు బిస్కెట్లు లెక్కపెట్టి పంచుకునే ప్రయత్నం చేశారు. పంపకాల వ్యవహారం లో కొద్దిపాటి తేడాలు రావడాన్ని పక్కనే ఉన్న ఆటోడ్రైవర్లు సయ్యద్‌ ఇక్బాల్, సయ్యద్‌ సాబీర్‌ గమనించారు. తమకు వాటాలు ఇవ్వాలని, లేదంటే పోలీసులకు సమాచారం ఇస్తామని రైల్వేకూలీలను ఆటోడ్రైవర్లు బెదిరించారు. పలు చర్చలు, వాగ్వాదాల అనంతరం చివరకు ఐదుగురు బంగారు బిస్కెట్లను పంచుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. దూరంగా ఈ తతంగాన్ని గమనించిన మరొకరు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసుల రంగ ప్రవేశంతో వ్యవహారమంతా బెడిసికొట్టింది. ఎప్పుడు నేరాలు చేయని ముగ్గురు రైల్వేపోర్టర్లు, ఇద్దరు ఆటోడ్రైవర్లు పరాయి సొమ్ముకు ఆశపడి కటకటాలపాలయ్యారు. 
 
వీడని మిస్టరీ...: 28 బంగారు బిస్కెట్లు పోలీసుల చేతికి చిక్కి 48 గంటలు గడిచిపోయినా సదరు బంగారం ఎవరిదన్నది తేలలేదు. ఎవరో ఒక వ్యక్తి నడుంబెల్టును ప్రవేశద్వారం వద్దే వదిలి వెళ్లడం మాత్రం చూశామని కూలీలు చెబుతున్నారు. బంగారు బిస్కెట్లు స్విట్జర్లాండ్‌ నుంచి ఇక్కడికి చేరినట్టుగా వాటి మీద ముద్ర ఉందని డీజీపీ కృష్ణప్రసాద్‌ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. రైల్వేస్టేషన్‌ ప్రవేశ ద్వారం వద్ద సీసీ కెమెరాలు లేని కారణంగా బంగారం వదిలివెళ్లిన వ్యక్తిని గుర్తించే అవకాశం లేకుండా పోయిందన్నారు.  
మరిన్ని వార్తలు