నేటి నుంచి ఆస్పత్రుల్లో రెండు రంగుల దుప్పట్లు

8 May, 2017 03:45 IST|Sakshi

- రోజు విడిచి రోజు మార్చనున్న సిబ్బంది
- ప్రతి సోమవారం గులాబీ, మంగళవారం తెల్ల బెడ్‌షీట్‌


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల పడకలపై రెండు రంగుల బెడ్‌షీట్లు దర్శనమివ్వనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వాస్పత్రుల్లో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం సోమవారం ప్రారంభం కానుంది. ఇకపై అన్ని ప్రభుత్వాస్పత్రుల పడకలపై ప్రతి సోమవారం గులాబీ బెడ్‌షీట్లు, మంగళవారం తెల్ల బెడ్‌షీట్లు వేస్తారు. రోజు విడిచి రోజు ఆ 2 రంగుల బెడ్‌షీట్లను మారుస్తూ ఉంటారు. రాష్ట్రంలో మొత్తం 20 వేల పడకలకు లక్ష బెడ్‌షీట్లు పంపిణీ చేయాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది.

ప్రస్తుతం 10,737 పడకలకు 51,998 రంగు రంగుల బెడ్‌షీట్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిని వివిధ ఆస్పత్రులకు పంపించారు. మిగిలిన వాటికి త్వరలోనే పంపిణీ చేయనున్నారు. అందులో 19,974 గులాబీ, 19,974 తెల్ల బెడ్‌షీట్లు ఉన్నాయి. 6,025 లేత నీలం, 6,025 ముదురు నీలం బెడ్‌ షీట్లను సిద్ధం చేశారు. అలాగే ప్రతి రోజు పడకలపై బెడ్‌షీట్లు మారుస్తారు. ఇప్పటికే వైద్య రంగంలో అనేక సంస్కరణలు తెస్తున్న సీఎం కేసీఆర్‌కు రంగురంగుల బెడ్‌షీట్ల పంపిణీతో పరిశుభ్రత పెరుగుతుందని వైద్యారో గ్యశాఖ వర్గాలు తెలిపాయి.  

ప్రతిరోజూ బెడ్‌ షీట్లు మార్చాల్సిందే...
ఇప్పటివరకు పడకలు పాడైపోయినా, వాటిపై వేసే బెడ్‌షీట్లు మార్చ కపోయినా అడిగే నాథుడే ఉండేవాడు కాదు. తెల్ల బెడ్‌షీట్‌ ఉన్నా అవి ఎన్ని రోజులకు మారుస్తారో, అసలు మారుస్తున్నారో లేదో కూడా తెలిసే ది కాదు. దీంతో అనేక ఇన్ఫెక్షన్లతో రోగులు బాధలు పడాల్సి వచ్చేది. దీని కి విరుగుడుగా వైద్యారోగ్య శాఖ రంగు రంగుల దుప్పట్లను ఏర్పాటు చేసింది. ఇక ప్రతి సోమవారం నుంచి కచ్చితంగా ప్రతి రోజు బెడ్‌షీట్లు మార్చాల్సిందే. సోమవారం గులాబీ వేస్తే, మంగళవారం తెల్ల బెడ్‌షీట్లు వేస్తారు.

అలా బుధవారం గులాబీ రంగు బెడ్‌షీట్, గురువారం తెల్ల బెడ్‌ షీట్‌ ఇలా మారుస్తూ పోతారని వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. బెడ్‌ షీట్లతోపాటు అనేక ఆస్పత్రులనూ ఆధునీకరించి, ఆధునిక వైద్య పరికరాలను, కొత్త ఫర్నీచర్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. బెడ్‌షీట్ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం సిద్దిపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావుతో కలసి వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభిస్తారు. మిగతా ఆస్పత్రుల్లో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు బెడ్‌షీట్లు పంపిణీ చేస్తారు.

మరిన్ని వార్తలు