రాష్ట్రానికి రెండు ఎకనమిక్‌ కారిడార్లు

3 May, 2017 02:40 IST|Sakshi
రాష్ట్రానికి రెండు ఎకనమిక్‌ కారిడార్లు

మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు కొత్తగా రెండు ఎకనమిక్‌ కారిడార్‌ రహదారులు మంజూరయ్యాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. నార్కెట్‌పల్లి–నల్లగొండ–తిప్పర్తి–మిర్యాలగూడ–కొండ్రపోలు– పొందుగల మధ్య 98 కి.మీ. మేర, జడ్చర్ల– దామగ్నాపూర్‌–కర్ణాటక సరిహద్దు వరకు 109 కి.మీ. మేర రెండు రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. మంగళవారం ఈ మేరకు ఆయన రహదారులపై సమీక్షించారు. జూన్‌ 1వ తేదీ తర్వాత రోడ్లపై గుంతలు కనిపిస్తే అధికారులను సస్పెండ్‌ చేస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించిన నేపథ్యంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ రెండు ఎకనమిక్‌ కారిడార్లపై అధికారులతో చర్చించారు. సంబంధించిన డీపీఆర్‌లు సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు.

2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.4,500 కోట్ల విలువైన పనులతో కూడిన వార్షిక ప్రణాళికకు అదనంగా ఆరాంఘర్, ఉప్పల్, ఎల్‌బీనగర్‌ కూడళ్లలో నిర్మించే మూడు ఎలివేటెడ్‌ కారిడార్లు జతయ్యాయని పేర్కొన్నారు. మొత్తంగా రూ.5,900 కోట్ల విలువైన పనులు రాష్ట్రానికి సాధించినట్టు వెల్లడించారు. జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణ ఇబ్బందులు అధిగమించేలా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. సీఎం ఆదేశించినట్టుగా రహదారులపై గుంతలు లేకుండా మే చివరి నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేల భవనాల నిర్మాణాన్ని వేగిరం చేసి సకాలంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో ఈఎన్‌సీలు రవీందర్‌రావు, గణపతిరెడ్డి, సీఈలు చంద్రశేఖరరెడ్డి, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు