చెదిరిన ప్రశాంతత

15 May, 2014 04:47 IST|Sakshi
చెదిరిన ప్రశాంతత

- భయం గుప్పిట్లో సిక్ చావ్ని     
- కొనసాగుతున్న కర్ఫ్యూ
- సాయుధ దళాల పహారా       
- రోడ్లు నిర్మానుష్యం
- సంయమనం పాటించమంటున్న పోలీసులు

 
 అత్తాపూర్, అబిడ్స్, అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: క్షణంక్షణం.. భయం భయం.. ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళన.. వెరసి కిషన్‌బాగ్ సిక్‌చావ్ని ప్రజలు బుధవారం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. పొద్దుపొద్దునే ఇరువ ర్గాల మధ్య జరిగిన ఘర్షణ దరిమిలా రాళ్లదాడి.. గృహదహనాలు, వాహనాల ధ్వంసం, పోలీసు కాల్పులు.. కత్తిపోట్లతో కిషన్‌బాగ్ సిక్‌చావ్ని అట్టుడికి పోయింది.

 

కళ్ల ముందు జరిగిన కల్లోలానికి స్థానికులు తల్లడిల్లి పోయారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోవడం.. మరో 25 మంది గాయపడ్డారని తెలియడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాలేదు. సాయంత్రం వరకు రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. రోజంతా ఈ ప్రాంతం కర్ఫ్యూ నీడలో, పోలీసు బూట్లు, సైరన్ మోతలతో మార్మోగింది. అంతటా ఘటన గురించే చర్చించడం కనిపించింది.

అడుగడుగునా పోలీసులే..
సంఘటన విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, కేంద్ర బలగాలు, టాస్క్‌ఫోర్స్, క్రైం బ్రాంచ్ తదితర విభాగాలకు చెందిన సిబ్బందినంతా సిక్‌చావ్ని ప్రాంతంలో మోహరించారు. స్థానిక పోలీసులతో పాటు శంషాబాద్ డివిజన్ పరిధిలోని పోలీస్‌స్టేషన్ సిబ్బందిని సైతం రప్పించి బందోబస్తును ముమ్మరం చేశారు. అడుగడుగునా పోలీసులను మోహరించి బందోబస్తును నిర్వహించారు. కేంద్ర బలగాలు సాయంత్రం ప్రధాన రహదారితో పాటు బస్తీల్లో కవాతు నిర్వహించారు.

నిఘా వైఫల్యం..
నాలుగు రోజుల నుంచి సిక్‌చావ్నీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగే అవకాశాలు ఉన్నాయనే విషయం సాధారణ ప్రజలకు తెలుసుకున్నా మన నిఘా వర్గాలు మాత్రం పసికట్టడంలో విఫలమయ్యాయి. నాలుగురోజుల క్రితం కిషన్‌బాగ్‌లోని ఓ ప్రార్ధనా మందిర ప్రధాన ద్వారానికి గుర్తుతెలియని వ్యక్తులు మాంసపు ముద్దలను పెట్టారని ఓ వర్గం వారు ఆరోపించినా పోలీసులు పట్టించుకోలేదు. మంగళవారం రాత్రి అదే వర్గానికి చెందిన జెండాను గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేయడం ఘర్షణలకు దారితీసింది.

దశాబ్దం క్రితం ఇదే చోట, ఇదే కారణంగా పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగిన విషయాన్ని నిఘా వర్గాలు మరచిపోయాయి. ఎవరికి వారు పట్టనట్టు వ్యవహరించారని, ప్రాణాల మీదకు వచ్చేంత వరకు నిద్ర మత్తులో ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా ఇరు వర్గాల ఘర్షణలకు ముఖ్యంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలనే ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ బీఎస్‌ఎఫ్ బలగాలను ఎందుకు ఉపయోగించారనే విషయమై అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు.

పదకొండేళ్ల క్రితం ఇలాగే..
పదకొండేళ్ల క్రితం ఇదే జెండాను కొందరు గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి వేళ దగ్ధం చేశారు. ఉదయం చూసిన మరో వర్గం ప్రజలు కోపోద్రిక్తులై పరస్పరం ఒకరిపై ఒకరు దాడు లు చేసుకున్నారు. రెండు గంటలపాటు జరిగిన ఈ దాడుల్లో ఇరువర్గాలకు చెందిన అనేక ఇళ్లు లూటీలకు గురయ్యాయి. ప్రస్తుతం బుధవారం ఇదే సంఘటన పునరావృతం కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గత అనుభవాన్ని తలుచుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు.
 
పోలీసుల వైఫల్యంతోనే దాడులు: లోథా

పోలీసుల వైఫల్యంతోనే దాడులు జరిగాయని గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి, రాష్ట్ర బీజేపీ గోరక్షా సెల్ అధ్యక్షులు రాజాసింగ్‌లోథా ఆరోపించారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని ఆయన పరామర్శించారు. నాలుగు రోజుల క్రితం రెచ్చగొట్టే విధంగా ఓ వర్గం వారు ప్రవర్తించిన తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.
 
మార్చురీ వద్ద ఉద్రిక్తత
ఈ ఘటనలో మృతి చెందిన ఇద్దరి మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. విషయం తెలియగానే బాధిత కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఎంఐఎం నాయకులు పాషాఖాద్రి, అహ్మద్ బలాల అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించేంత సేపు ఆసుపత్రి గేట్లను మూసివేశారు. ఉస్మానియా మార్చురీ అధిపతి టకీయుద్దీన్ ఆధ్వర్యంలో డాక్టర్లు సుధ, జనార్దన్, అభిజిత్‌లు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మరో మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఘటనలో గాయపడిన వారంతా ప్రస్తుతం ఉస్మానియా, ప్రీమియర్, నిమ్స్, అపోలో, కేర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అల్లరి మూకలను గుర్తించే పనిలో పోలీసులు
అల్లర్లతో పాటు రాళ్లు రువ్విన యువకులను గుర్తించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం మీడియా వీడియో క్లిప్పింగ్‌లు, ఫొటోలను సేకరిస్తున్నారు. వీటి ఆధారంగా మూకలను గుర్తించవచ్చని పోలీసులు వెల్లడిస్తున్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లో ఇళ్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను సేకరిస్తున్నామని, వీటి సాయంతో నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
 
సంయమనం పాటించండి: సీవీ ఆనంద్
ఇరువర్గాలు సంయమనం పాటించాలని, వదంతులను నమ్మవద్దని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు. అల్లర్లు పూర్తిగా సద్దుమణిగే వరకు బందోబస్తు కొనసాగిస్తూ ఉంటామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించామన్నారు. కర్ఫ్యూ సడలించే విషయంపై ఇంకా నిర్ణయించలేదన్నారు.

మరిన్ని వార్తలు