ఇంజక్షన్లు వికటించాయా!

2 Mar, 2017 04:20 IST|Sakshi
ఇంజక్షన్లు వికటించాయా!

గాంధీలో ఇద్దరు రోగుల మృతి
ఇంజక్షన్‌ వికటించడం వల్లే చనిపోయారంటున్న బంధువులు
ఆస్పత్రి ప్రాంగణంలో ఆందోళన.. లిఖితపూర్వకంగా ఫిర్యాదు
కార్డియాక్‌ అరెస్ట్‌ వల్లే వారు చనిపోయారని వైద్యుల వివరణ
ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపిస్తా..: సూపరింటెండెంట్‌


హైదరాబాద్‌: ఇంజక్షన్‌ వికటించడంతో ప్లాస్టిక్‌ సర్జరీ వార్డులో చికిత్స పొందుతున్న తమవారు చనిపోయారంటూ బుధవారం గాంధీ ఆస్పత్రి వద్ద మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. అయితే,  కార్డి యాక్‌ అరెస్ట్‌ వల్లే వారిద్దరూ చనిపోయి నట్లు వైద్యులు స్పష్టం చేస్తున్నారు. విద్యుత్‌ పంపిణీ సంస్థ లో కాంట్రాక్ట్‌ వర్కర్‌గా పనిచేస్తు న్న వనపర్తికి చెందిన కోక నరేశ్‌(17) జనవరి 17న ప్రమాద వశాత్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రగాయాలతో బాధపడుతున్న అతనిని చికిత్స కోసం గాంధీలో చేర్చారు. అతని శరీరంలో 15 శాతం కాలిపోయినట్లు గుర్తించిన వైద్యులు.. ఆ మేరకు బర్నింగ్‌ వార్డులో చేర్చుకుని పలు దఫాలుగా చికిత్సలు అందించారు. నరేశ్‌ కోలుకోవడంతో నాలుగు రోజుల్లో అతనిని డిశ్చార్జి చేయాల్సి ఉంది.

బుధవారం ఉదయం తొమ్మిదిన్నరకు నరేశ్‌కు ఇంజక్షన్‌ ఇవ్వగా.. ఆ తర్వాత అర గంటకే అతను చనిపోయాడు. ఇదిలా ఉంటే 60 శాతం కాలిన గాయాలతో బాధపడుతూ మూడు రోజుల నుంచి ఇదే వార్డులో చికిత్స పొందుతున్న కరీంనగర్‌ జిల్లా చొప్పదండికి చెందిన భారతి కూడా చనిపోయింది. నర్సింగ్‌ సిబ్బంది వచ్చి మూడు ఇంజక్షన్లు ఇచ్చారని, ఆయా ఇంజక్షన్లు వికటిం చడం వల్లే నరేశ్, భారతి మృతిచెందారని ఆరోపిస్తూ వారి బంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. ఇన్‌చార్జి సూపరిం టెండెంట్‌ డాక్టర్‌ బీవీఎస్‌ మంజులను కలసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.  గాంధీ ఆస్పత్రిలో పురుగు అవశే షాలు ఉన్న సెలైన్‌ ఎక్కించడంతో ఇటీవల ఓ చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతిచెందిన విషయం తెలిసిందే.

కార్డియాక్‌ అరెస్ట్‌ వల్లే..: వైద్యులు
గాంధీలో ఇద్దరు రోగుల మృతి ఘటనలో వైద్యపరమైన నిర్లక్ష్యం ఏమీ లేదని ఆస్పత్రి ఇంచార్జీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మంజుల స్పష్టం చేశారు. ఎలక్ట్రికల్‌ షాక్‌ తగిలినవారికి గుండె సంబంధ సమస్యలు ఉత్పన్నమవు తాయని, దీన్నే వైద్య పరిభాషలో ఎరిథిమియా అంటారని, నరేశ్‌ కార్డియాక్‌ అరెస్ట్‌(గుండె ఆగిపోవడం)తోనే మృతిచెందినట్లు ప్రాథమిక పరిశీలనలో తేలిందని వివరించారు. 60 శాతం కాలిన గాయాలతో చికిత్సపొందుతున్న భారతి యాస్‌ప్రేషన్‌ నిమోనియాతో మృతిచెం దిందని, కాలిన గాయాలు త్వరితగతిన మానేందుకు అవసరమైన యాంటీ బయోటిక్స్‌ అందించేందుకు పెంటా ప్రోజోల్, రాన్‌ట్యాక్‌ వంటి ఇంజక్షన్లు ఇస్తుంటామని, ప్రతిరోజు మాదిరిగానే బుధవారం కూడా ఇవే ఇంజక్షన్లు ఇచ్చారని చెప్పారు.

ఒకవేళ ఇంజక్షన్లు వికటిస్తే వార్డులో చికిత్స పొందుతున్న మిగిలిన రోగులు కూడా మృతి చెందాలి కాదా? అని ప్రశ్నించారు. ఇంజక్షన్‌ వికటించిందనే ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ అంశంపై సమగ్ర విచారణ చేసి, ఒకవేళ వైద్యపరమైన నిర్లక్ష్యం, ఇంజక్షన్లలో లోపం ఉన్నట్లైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె ప్రకటించారు.

మరిన్ని వార్తలు