ప్రభుత్వ పార్కింగ్ స్థలం వారిదే!

7 Apr, 2016 21:55 IST|Sakshi

అబిడ్స్: అధికారులు ఏర్పాటు చేసిన ఉచిత పార్కింగ్ స్థలం వారిదే అన్న తీరుగా.. వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అబిడ్స్ పోలీసులు అరెస్టుచేశారు. జీహెచ్‌ఎంసీ 8వ సర్కిల్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ బాబయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అబిడ్స్ జగదీష్ మార్కెట్‌లో కొన్ని నెలలుగా ప్రతిరోజూ వందలాది వాహనాల వద్ద పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్న ఫైజుల్, ఎం. మఫీలను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

అయితే ఈ విషయమై కొంతమంది స్థానిక వ్యాపారస్తులు, సన్నిహితులు వారిని విడిచిపెట్టాలని పోలీసులను డిమాండ్ చేశారు. అంతేగాక చార్మినార్ మజ్లిస్ ఎమ్మెల్యే పాషాఖాద్రీకి కూడా వారు ఫిర్యాదు చేశారు. అయితే, సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, అబిడ్స్ ఏసీపీ రాఘవేందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌లు ఎమ్మెల్యేకు వారిద్దరినీ ఎందుకు అరెస్టు చేశామో వివరించారు. ప్రజలకు ఉచిత పార్కింగ్ జీహెచ్‌ఎంసీ కల్పిస్తే ఎందుకు పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారని పోలీసు అధికారులు ఈ విషయమై ప్రశ్నించిన ఎమ్మెల్యేను ప్రశ్నించడంతో తనకేమీ తెలియదంటూ ఆయన వెళ్లిపోయారు. ఇద్దరు నిందితులపై పోలీసులు పలు కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు