కుక్క కోసం కొట్టుకున్నారు...

2 Mar, 2016 08:42 IST|Sakshi
కుక్క కోసం కొట్టుకున్నారు...

హైదరాబాద్ : ఆస్తి కోసం కొట్టుకోవడం చూశాం....అమ్మాయి కోసం కొట్టుకుంటారని విన్నాం...కానీ ఇదేం విచిత్రమో కుక్క కోసం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కుక్కే కదా అని తీసిపారేయకండి. చివరకు ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. కుక్క నాదంటే... నాదంటూ నడిరోడ్డుపై కొట్లాటకు దిగిన ఈ సంఘటన హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఎల్బీనగర్కు చెందిన సురేందర్ రెడ్డి కొన్ని రోజుల క్రితం స్నేహితుడి వద్ద నుంచి ఓ కుక్కను తెచ్చుకుని పెంచుకుంటున్నాడు. సరూర్‌నగర్‌కు చెందిన ఉపేందర్‌రెడ్డి పెంచుకుంటున్న కుక్క అయిదు నెలల క్రితం తప్పిపోయింది. దీంతో పోలీస్‌స్టేషన్‌లో కంప్లైట్‌ ఇచ్చాడు.

సోమవారం రాత్రి సురేందర్ రెడ్డి తన కుక్కను తీసుకుని రోడ్డు మీదకి వచ్చాడు. అదే సమయంలో ఉప్పల్ వెళ్తున్న ఉపేందర్‌ సిరినగర్ కాలనీ వద్ద తన కారు ఆపాడు.  సురేందర్‌రెడ్డి అనే వ్యక్తి దగ్గర కుక్క కనిపించింది. అంతేకాదు ఉపేందర్‌ను గుర్తుపెట్టి కారు కూడా ఎక్కిందట. దీంతో ఆ కుక్క తనదే అంటున్నాడు ఉపేందర్‌. సురేందర్‌రెడ్డి మాత్రం ఓ కుటుంబం అమెరికా వెళ్తూ ఆ కుక్కను తనకు అప్పగించి వెళ్లారని చెప్తున్నారు. కుక్కను తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉపేందర్‌... సురేందర్‌ మధ్య గొడవ మొదలైంది. ఇద్దరూ ఒకరినొకరు కొట్టేసుకున్నారు. స్థానికులు గమనించి ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ వివాదం పోలీస్ స్టేషన్కు చేరింది.

మరిన్ని వార్తలు