ఎస్‌ఐ కావాలనుకొని...కిడ్నాపర్‌గా మారాడు

15 Feb, 2017 23:35 IST|Sakshi
ఎస్‌ఐ కావాలనుకొని...కిడ్నాపర్‌గా మారాడు

ఇద్దరు స్కూల్‌ విద్యార్థుల కిడ్నాప్‌
గంటలోనే కేసును చేధించిన గోపాలపురం పోలీసులు


మారేడుపల్లి: ఎస్‌ఐ కావాలనుకున్న ఓ యువకుడు ఉద్యోగం రాక పొవడంతో కిడ్నాపర్‌గా మారాడు. ఇద్దరు విద్యార్థులను కిడ్నాప్‌చేసి డబ్బు డిమాండ్‌చేశాడు. అయితే పోలీసులు గంటలోనే కిడ్నాపర్‌ను పట్టుకుని కటాకటాల్లోకి నెట్టారు. నార్త్‌ జోన్‌ పోలీస్‌ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో డీసీపీ సుమతి  వివరాలు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సికింద్రాబాద్‌ సెంట్‌ మేరిస్‌ స్కూల్‌లో ఐదవ తరగతి చదువుతున్న హర్షవర్దన్‌(9), ధీరజ్‌ (9)లను కిడ్నాప్‌ చేశామంటు కిడ్నాపర్‌ నుండి వారి తల్లిదండ్రులకు  ఫోన్‌ కాల్‌ వచ్చింది. వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు గోపాలపురం పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కాయిన్‌ బాక్స్‌ నుండి వచ్చిన కాల్స్‌ ఆధారంగా కిడ్నాప్‌ ను గంటలో పట్టుకున్నారు. కిడ్నాపర్‌ వద్ద ఉన్న ఇద్దరు విద్యార్థులను సురక్షితంగా పోలీసులు వారి తల్లి దండ్రులకు అప్పగించారు.

ఉద్యోగం కొరకు వచ్చి కిడ్నాపర్‌గా  అవతరం
జగిత్యాల జిల్లా మలియ మండలం తక్కల పల్లి గ్రామానికి చెందిన పి. చంద్రశేఖర్‌ (25) డిగ్రీ(బీఎస్సీ) వరకు చదివాడు. నగరంలో ఎస్‌ఐ ఉద్యోగానికి శిక్షణతీసుకొని ఫెయిల్‌ అయ్యాడు. అనుకున్న  ఉద్యోగం లభించక పోవడంతో  తన స్నేహితులైన రాకేష్, గణేష్‌ లను నగరానికి పిలిపించుకున్నాడు. నెలకు 15 వేల జీతం ఇస్తానాని సికింద్రాబాద్‌ పలు పాఠాశాల విద్యార్ధులకు ట్యూషన్‌ కొరకు మార్కెటింగ్‌ చేసి వారి తల్లి దండ్రలు ఫోన్‌ నెంబర్లను సేకరించాలని సూచించాడు. దీంతో 13వ తేదీ సెంట్‌మేరిస్‌ స్కూల్‌తో పాటు మరో స్కూల్‌ లో 12 మంది విద్యార్ధుల తల్లిదండ్రుల నెంబర్లను సెకరించి చంద్రశేఖర్‌కు ఇచ్చారు. మరుసటి రోజు చంద్రశేఖర్‌ సెంట్‌ మేరిస్‌ స్కూల్‌ వద్ద టూష్యన్‌కు ఆసక్తి కనపరచిన హర్షవర్దన్, ధీరజ్‌ లను మభ్య పెట్టి ట్యూషన్‌ డేమో క్లాస్‌ వినలంటూ స్థానికంగా ఓ చోటకు తీసుకు వెళ్ళాడు. వారి తల్లి దండ్రులకు కాయిన్‌ బాక్స్‌ నుండి ఫోన్‌ చేసి మొదట పిల్లలతో మాట్లాడించిన తరువాత పిల్లలను కిడ్నాప్‌ చేశామని లక్ష రూపాయాలు ఇవ్వాలంటూ  బెదిరించాడు. తల్లి దండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు  స్కూల్‌ వద్ద  నమోదైన సీసీ కెమేరాల దృశ్యాలు, ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా పాస్‌ పోర్టు కార్యాలయం సమీపంలో ఉన్న మల్లన్న ఆలయం వద్ద నిందితుడిని అదుపులొకి  తీసుకుని దర్యాప్తు చేశారు.. నిందితుడిని బుధవారం రిమాండ్‌ కు తరలించారు. ఈ సందర్భంగా గంటలోపే కేసును చేధించిన గోపాలపురం  ఎసిపి శ్రీనివాసరావు, సిఐ రాంచంద్రారెడ్డి, సిబ్బందిని డీసీపీ అభినందించారు.


విద్యార్ధులను తీసుకు వెళుతూ..(సీసీ కెమెరా ఫుటేజీ)

 

మరిన్ని వార్తలు