అటవీ శాఖలో 2 వేల పోస్టుల భర్తీకి చర్యలు

18 Oct, 2016 03:39 IST|Sakshi
అటవీ శాఖలో 2 వేల పోస్టుల భర్తీకి చర్యలు
సాక్షి, హైదరాబాద్: అటవీ శాఖలో ఖాళీగా ఉన్న రెండు వేల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనున్నట్లు ఆ శాఖ మంత్రి జోగురామన్న వెల్లడించారు. అటవీ శాఖ పునర్విభజనలో భాగంగా 12 కొత్త సర్కిళ్లు ఏర్పాటు చేశామని.. 31 మంది జిల్లా అటవీ అధికారులు, 37 మంది ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్లను నియమించినట్లు చెప్పారు. అలాగే 185 రేంజ్‌లు, 831 సెక్షన్‌లు, 3,132 బీట్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సోమవారం అరణ్యభవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంతకు ముందు టెరిటోరియల్, సామాజిక వన విభాగం, లాగింగ్, వన్యప్రాణి విభాగం బీట్ నుంచి సర్కిల్ వరకు అన్ని విభాగాలు విడివిడిగా ఉండేవని, ప్రస్తుతం అన్నీ కలసి పనిచేస్తాయన్నారు. 
 
అటవీ పరిధిని డివిజన్‌లకు 961 చ.కి.మీ. నుంచి 727 చ.కి.మీ., రేంజ్‌ను 254 చ.కి.మీ. నుంచి 145 చ.కి.మీ., సెక్షన్‌ను 57 చ.కి.మీ. నుంచి 32 చ.కి.మీ.కు తగ్గించినట్లు తెలియజేశారు. బీట్ పరిధిని తగ్గించడం అటవీ పరిరక్షణకు ఉపయోగపడుతుందని చెప్పారు. దేశంలో తొలిసారిగా జిల్లా అటవీ అధికారులను రాష్ట్రంలోనే నియమించినట్లు మంత్రి పేర్కొన్నారు. వచ్చే ఏడాది చేపట్టనున్న హరితహారం కింద  క్షీణించిన అడవుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని, ఇందుకోసం వచ్చేనెల నుంచే మొక్కల పెంపకానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. సమీక్షలో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, పీసీసీఎఫ్ పీకే ఝా, బయో డైవర్సిటీ చైర్మన్ ఏకే శ్రీవాస్తవ, ఫారెస్ట్ అకాడమీ డెరైక్టర్ రఘువీర్, హరితహారం ఇన్‌చార్జి డోబ్రియాల్ తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు