జలం..జనం

8 May, 2017 01:44 IST|Sakshi
జలం..జనం

ఇంకుడు గుంతల ఉద్యమానికి సాక్షి సిద్ధం
జలసిరి ఒడిసిపట్టేందుకు కదలాలి జనం..
నగరంలో  ప్రమాద ఘంటికలు మోగిస్తున్న భూగర్భ జలాలు
ఇంకుడు గుంతలే  శరణ్యమంటున్న జల నిపుణులు


మరో మహోద్యమానికి ‘సాక్షి’ ముందుకొచ్చింది. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలసిరిని పెంచేందుకు నడుంబిగించింది. పదండి ప్రతి ఇంటి ఆవరణలో విధిగా ఇంకుడుగుంతను ఏర్పాటు చేద్దాం. వృథాగా పోతున్న వాననీటిని ఇంకించి పాతాళం నుంచి జలసిరుల్ని పొంగిద్దాం. జలయజ్ఞాన్ని అకుంఠిత దీక్షతో సాగిద్దాం. ఇందుకు ‘సాక్షి’ మీకు దారి చూపుతుంది. ఎప్పటికప్పుడు సలహాలు..సూచనలు ఇస్తుంది. ఇంకుడు గుంతల గురించి ఇకపై సమగ్ర సమాచారం అందిస్తుంది. ఇందులో భాగంగా నగరంలో వర్షంపాతం..నీటి సరఫరా...వృథా..ప్రజల అవసరాలు, నిపుణుల సూచనలు తదితర అంశాలతో సమగ్ర కథనం నేటి నుంచి వరుసగా ప్రచురిస్తుంది. ఇంకుడు గుంతలపై చైతన్యమే లక్ష్యంగా సాగే ఈ యజ్ఞంలో తొలి కథనం ఇదీ...  –సాక్షి, సిటీబ్యూరో

సిటీబ్యూరో: అసలు గ్రేటర్‌ పరిధిలో నివాసాలెన్ని.. ఇంకుడు గుంతల ఏర్పాటు ఎందుకు..? ప్రజల అవసరాలకు కావాల్సిన నీరెంత..? వృథాగా పోతున్న జలం సంగతేంటి..? ఒడిసిపట్టకుంటే భవిష్యత్తలో జనం సంగతేంటి..? నిపుణుల సూచనలు.. ఇతర విషయాల్ని ఒకసారి ఆలకిస్తే...

ఇదీ దుస్థితి..
గ్రేటర్‌లో విలువైన వర్షపు నీటిని ఒడిసిపట్టే దారి లేకపోవడంతో పాతాళగంగ కనుమరుగవుతోంది.
ప్రతి ఇళ్లు, కార్యాలయం ఆవరణలో ఉన్న బోరుబావికి ఆనుకొని ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయకపోవడంతో రోజురోజుకూ భూగర్భ జలాలు అథఃపాతాళానికి చేరుతున్నాయి.
మారేడ్‌పల్లి, బోయిన్‌పల్లి, బోడుప్పల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో 1500 అడుగుల లోతు వరకు బోరుబావులు తవ్వినా నీటి చుక్క జాడ కనిపించడంలేదు.
విచక్షణా రహితంగా బోరుబావులు తవ్వడాన్ని నిషేధిస్తూ గతంలో చేసిన వాల్టా చట్టానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తూనే ఉన్నారు.
ఇంటి అవసరాలకోసం వ్యయప్రయాసలకోర్చి బోరుబావులు తవ్వుతున్న వారికి నీటిబొట్టు జాడ కనిపించడంలేదు.
 
భవంతులు లక్షల్లో.. గుంతలు వేలల్లో...
గ్రేటర్‌ పరిధిలో 22 లక్షల భవంతులుండగా.. వర్షపు నీటి నిల్వకు ఉన్న ఇంకుడు గుంతల సంఖ్య కేవలం లక్ష మాత్రమేనని భూగర్భజలశాఖ తాజా పరిశోధనలో వెల్లడైంది. లక్ష గుంతల్లో అధికశాతం నిరుపయోగంగా మారాయి. వీటిపై మట్టి, పెద్ద బండరాళ్లు, సిమెంట్, చెత్తాచెదారం పడడంతో వర్షపునీరు భూగర్భంలోకి చేరే పరిస్థితిలేదు. వీటిని పునరుద్ధరించే విషయంలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలి. కాలనీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సహకారం తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు.

ఇంకుడుగుంత ఇలా..
మన ఇల్లు లేదా కార్యాలయం ఆవరణలో ఇంకుడుగుంతను నిర్మించేందుకు భూగర్భ జలశాఖ నిపుణుడు సత్యనారాయణ కొన్ని సూచనల్ని అందించారు.
200 చదరపు అడుగుల విస్తీర్ణంగల స్థలంలో ఇంటిని నిర్మిస్తే బోరుబావికి మీటరు లేదా రెండు మీటర్ల దూరంలో రీఛార్జి పిట్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
పొడవు, వెడల్పులు 2 మీటర్ల మేర ఉండాలి.
1.5 మీటర్ల లోతున గుంత తీయాలి.
ఇందులో 50 శాతం 40ఎంఎం పరిమాణంలో ఉండే పలుగు రాళ్లు, 25 శాతం 20 ఎంఎం సైజులో ఉండే రాళ్లను నింపాలి.
మరో 15 శాతం బఠానీగింజ పరిమాణంలో ఉండే ఇసుకతో నింపాలి.
10 శాతం ఖాళీగా ఉంచాలి.
భవనం పైకప్పు నుంచి పడిన వర్షపునీరు ఈ పిట్‌పై కొద్దిసేపు నిలిచేలా ఏర్పాటు చేసుకోవాలి. దీంతో భూగర్భజలాల రీఛార్జీ సులువవుతుంది.
మీ బోరుబావి ఎండిపోకుండా ఉంటుంది.

మరిన్ని వార్తలు