అనూహ్యం.. అతలాకుతలం

12 Nov, 2016 02:10 IST|Sakshi
అనూహ్యం.. అతలాకుతలం

►  కేంద్రం వరుస షాక్‌లతో
►  రాష్ట్రం బెంబేలు
►  రూ.2000 కోట్ల మేరకు పన్నుల వాటాకు గండి
►  నోట్ల రద్దుతో ఆదాయ అంచనాలు తలకిందులు

సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన రాష్ట్రం... ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి కుదుట పడుతోంది. జిల్లాల ఏర్పాటుతో రియల్ వ్యాపారం ఊపందుకుంది. భూముల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. ఇక ఆర్థిక లోటు ఉండదు అనుకుంటున్న తరుణంలో పెద్ద నోట్ల రద్దు, కేంద్ర నిధుల్లో కోత ఆర్థిక శాఖను కలవరపెడుతోంది. పెద్ద నోట్ల రద్దుతో చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర ఆర్థిక శాఖను అతలాకుతలం చేస్తున్నాయి. స్థిరాస్తి వ్యాపారం స్తంభించడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం ఊహించనంతగా పడిపో యింది. భవిష్యత్తులో వ్యాట్ పెరుగుతుందనే భరోసా ఉన్నప్పటికీ నగదు లావాదేవీలతో సంబంధమున్న వ్యాపారాలన్నీ స్తబ్దుగా ఉన్నాయి.

కొత్త జిల్లాలతో రియల్ వ్యాపారం ఊపందుకుంటున్న తరుణంలో నోట్ల రద్దు ప్రభావం ఒక్కసారిగా దెబ్బతీసిందని ప్రభుత్వం భావిస్తోంది. భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా భారీగా ఆదాయం పెరుగుతుందని ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం అంచనా వేసుకుంది. కానీ కేంద్రం నిర్ణయంతో  అంచనాలు తలకిందులయ్యాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. నోట్ల రద్దు పరిణామాలు ఇప్పటికిప్పుడు అంచనా వేసే పరిస్థితి లేదని, కొంతకాలం గడిస్తే రాష్ట్రాలకు వచ్చే ఏయే పన్నులు పెరిగే అవకాశముంది, ఏయే పన్నులు తగ్గే పరిస్థితి ఉందని స్పష్టత వస్తుందని చెబుతున్నారు.

కేంద్రానికి లేఖ రాసే యోచన..
ఇదే తరుణంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాలో కోత పెట్టడం పుండు మీద కారం చల్లినట్ల యింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి పన్నుల వాటా కింద రూ.13,995 కోట్లు వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. నెలసరి వా యిదాల్లో కేంద్రం ఈ నిధులు విడుదల చేస్తుంది. ఏడాది చివర్లో పన్నుల ద్వారా కేంద్రానికి వచ్చే రాబడికి అనుగుణంగా నిధుల్లో కోత వేస్తుంది. ఈసారి ఆర్థిక సంవత్సరం మధ్యలోనే 48 శాతం కోత విధించింది. దీంతో దాదాపు రూ.2,000 కోట్ల మేరకు పన్నుల వాటాను కేంద్రం కత్తిరించే అవకాశం ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ లెక్కలేసింది.

నోట్ల రద్దు ప్రభావానికి తోడు పన్నుల ద్వారా రావాల్సిన రాబడి తగ్గటంతో ఈ నెలలో ఖర్చులకు సరిపడే ఆదాయం సమకూరుతుందా.. లేదా... అని ఆర్థిక శాఖ మల్ల గుల్లాలు పడుతోంది. ఇప్పటికే ఈ పరిణామాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. గవర్నర్ నరసింహన్‌కు నివేదించారు. తాజా పరిణామాలతో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

>
మరిన్ని వార్తలు