పీజీ ప్రవేశాలకు ఇకపై ఒకే పరీక్ష

21 Sep, 2016 20:36 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేందుకు ఇకపై ఒకటే ప్రవేశ పరీక్షను నిర్వహించేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. వేర్వేరు యూనివర్సిటీల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం వేర్వేరుగా ప్రవేశ పరీక్షల నిర్వహణ సరికాదన్న నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే డిగ్రీ ప్రవేశాలను ఆన్‌లైన్ చేసినందున పీజీ ప్రవేశాలను ఆన్‌లైన్ చేయడంతోపాటు ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా అన్ని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

2017-18 విద్యా సంవత్సరంలో దీనిని అమల్లోకి తేవాలని భావిస్తోంది. ప్రస్తుతం ప్రవేశ పరీక్షలను కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షల ద్వారా అర్హత సాధించిన అభ్యర్థులు వివిధ జిల్లాల్లోని యూనివర్సిటీ క్యాంపస్‌లు, పీజీ కాలేజీల్లో చేరుతున్నారు. రాష్ట్రంలో యూనివర్సిటీ క్యాంపస్‌లు, ప్రభుత్వ పీజీ కాలేజీలు 76 ఉండగా, ప్రైవేటు పీజీ కాలేజీలు 444 ఉన్నాయి. వాటిల్లోని 25,285 పీజీ సీట్లను కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

అయితే యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలకు అధిక డిమాండ్ ఉండటంతో విద్యార్థులు రెండు ప్రవేశ పరీక్షలు రాయాల్సి వస్తోంది. పైగా కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష రాసేందుకు హైదరాబాద్, మహబూబ్‌ననగర్ , రంగారెడ్డి తదితర జిల్లాల అభ్యర్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలే జీలు, ఇతర యూనివర్సిటీ క్యాంపస్‌లలో చేరేందుకు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాల విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలో ఒకే యూనివర్సిటీ ద్వారా ప్రవేశ పరీక్షను అన్ని జిల్లాల్లో నిర్వహించి ఆ ర్యాంకుల ఆధారంగా అన్ని యూనివర్సిటీలు, వాటి పరిధిలోని కాలేజీల్లో చేరేలా కౌన్సెలింగ్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై త్వరలోనే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతకంటే ముందుగానే కాకతీయ, ఉస్మానియా, ఇతర యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్లతోనూ దీనిపై సమావేశం నిర్వహించేందుకు ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఉస్మానియా లేదా కాకతీయ యూనివర్సిటీ ఒక్కటే నిర్వహించేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది.

మరిన్ని వార్తలు