రాష్ట్ర ఐటీకి కేంద్రమంత్రి అభినందన

13 Jun, 2016 03:33 IST|Sakshi
రాష్ట్ర ఐటీకి కేంద్రమంత్రి అభినందన

ఐటీ మంత్రి కేటీఆర్ కు లేఖరాసిన రక్షణ శాఖ మంత్రి పారికర్
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ప్రశంసించారు. ఈ మేర కు రాష్ట్ర ఐటీ శాఖను నిర్వహిస్తున్న మంత్రి కె.తారక రామారావు కృషిని అభినందిస్తూ తాజాగా లేఖ రాశారు. ప్రధానంగా టీ-హబ్ ద్వారా స్టార్టప్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందించడాన్ని లేఖలో కేంద్ర మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వంతో కేంద్రం కలసి పనిచేస్తుందని మనోహర్ పారికర్ పేర్కొన్నారు. టీ-హబ్‌తో రక్షణ శాఖ భాగస్వామ్యం ద్వారా డిఫెన్స్ టెక్నాలజీ రంగంలో స్టార్టప్ ఇకో సిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు వీలవుతుందని, ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని డీఆర్‌డీవోను ఆదేశించినట్లు కేంద్రమంత్రి ఆ లేఖలో వివరించారు. కాగా, ఐటీశాఖ పనితీరును ప్రశంసిస్తూ రక్షణ మంత్రి లేఖరాయడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో డిఫెన్స్/ ఏరోస్పేస్ ఇంక్యుబేటర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరనున్నట్లు కేటీఆర్ తెలిపారు.

 మలేషియా మంత్రి నుంచి మరో లేఖ
 రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు మలేషియా ప్రభుత్వం తరఫున పరిశ్రమల మంత్రి ముస్తఫా మహమ్మద్ నుంచి మరోలేఖ అందింది. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన ఆయన మలేషియన్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అం దిస్తున్న సహకారం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ ఈ లేఖరాశారు. భవిష్యత్‌లోనూ మలేషియా, తెలంగాణ మధ్య ఇదేరకమైన సుహృద్భావ సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. మరిన్ని వ్యాపార సంబంధాలను పెంపొందించుకునేందుకు మలేషియాకు రావాల్సిందిగా, మంత్రి కేటీఆర్‌ను ముస్తఫా ఆహ్వానించారు.

మరిన్ని వార్తలు