ఆరోగ్య భారత్ నిర్మాణమే ధ్యేయం

10 Feb, 2016 00:31 IST|Sakshi
ఆరోగ్య భారత్ నిర్మాణమే ధ్యేయం

కేంద్ర మంత్రి జగత్‌ప్రకాశ్ నడ్డా
 
 హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యధికంగా పిల్లలు, యువత ఉన్న మన దేశాన్ని ఆరోగ్య భారత్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్‌ప్రకాశ్ నడ్డా చెప్పారు. ఫిబ్రవరి 10 జాతీయ నులిపురుగుల నిర్మూలన దినాన్ని పురస్కరించుకుని మంగళవారం నార్సింగ్ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినులకు మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా ఈ ఏడాది 27 కోట్ల మంది చిన్నారులకు నులిపురుగుల నిర్మూలన మాత్రలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. దీనిని సాధిస్తే ప్రపంచంలో అత్యధిక మందికి మందులు పంపిణీ చేసిన కార్యక్రమంగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పల్స్‌పోలియో తరహాలో సమష్టిగా కృషి చేయాలన్నారు. ‘మిషన్ ఇంద్రధనస్సు’తో చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, గతంలో ఉన్న 7 వ్యాక్సిన్లను ప్రస్తుతం 11కు పెంచినట్లు తెలిపారు. గత ఏడాది రాజస్తాన్‌లో నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఈ ఏడాది తెలంగాణలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా విడతల వారీగా ఎయిమ్స్ వర్సిటీలను ఏర్పాటు చేస్తున్నామని, తెలంగాణలోనూ ఎయిమ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ  ఇచ్చారు.

 అంతా సహకరించాలి: లక్ష్మారెడ్డి
 నులిపురుగుల సమస్యను నివారించేందుకు చేపట్టిన మాత్రల పంపిణీని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి కోరారు. రాష్ట్రంలో ఈ నెల 15 వరకు కోటి మంది చిన్నారులకు మందు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, కేంద్ర వైద్యశాఖ అడిషనల్ డెరైక్టర్ సీకే మిశ్రా, రాష్ట్ర కార్యదర్శులు బుద్ధప్రసాద్, రాకేశ్‌కుమార్, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు