ముందు ‘మిగులు’పై తేల్చండి?

9 Feb, 2016 02:28 IST|Sakshi
ముందు ‘మిగులు’పై తేల్చండి?

♦ మిగులు జలాలకు స్పష్టమైన నిర్వచనం ఇవ్వండి
♦ నదుల అనుసంధానంపై భేటీలో రాష్ట్రం డిమాండ్
♦ గోదావరిలో మిగులు జలాలు లేవని తేల్చిచెప్పిన విద్యాసాగర్‌రావు
♦ ‘మిగులు’ విధివిధానాల ఖరారు బాధ్యతలు
♦ సబ్‌కమిటీకి అప్పగించిన కేంద్రమంత్రి ఉమాభారతి
♦ రెండు వారాల్లో నివేదించాలని ఆదేశం
 
 సాక్షి, హైదరాబాద్: నదుల అనుసంధానం అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త అభ్యంతరాలను తెరమీదకు తెచ్చింది. అసలు నదీ జలాల్లో ‘మిగులు జలాలు’ అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం ఇవ్వాలని, ఆ తర్వాతే ఈ అంశంలో ముందుకు వెళ్లాలని డిమాండ్ చేసింది. నికర జలాల్లో రాష్ట్రాలు వాడుకున్నాక మిగిలిన జలాలను ‘మిగులు’ అనాలా, లేక వరదల ద్వారా వచ్చే అదనపు నీటిని ‘మిగులు’ అనాలా? అన్నదానిని ముందుగా తేల్చాలని స్పష్టం చేసింది. కేంద్ర జల వనరుల శాఖ చెబుతున్నట్లుగా మహానది, గోదావరి నదుల్లో మిగులు జలాలపై స్పష్టత రావడానికి ఈ నిర్వచనం అత్యావశ్యకమని పేర్కొంది. ఈ డిమాండ్‌పై వెంటనే స్పందించిన కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి... ‘మిగులు జలాల’ను స్పష్టంగా నిర్వచించేలా విధివిధానాలను ఖరారు చేయాలని జల వనరుల శాఖ ముఖ్య సలహాదారు నావల్‌వాలా నేతృత్వంలోని నదుల అనుసంధాన సబ్‌కమిటీని ఆదేశించారు. ఇది చాలా ముఖ్యమైన అంశమైనందున అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోవాలని, ఏకాభిప్రాయం ఉండేలా నిర్వచనాన్ని కనుగొనాలని సూచించారు. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

 ఢిల్లీలో సమావేశం: కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానంలో భాగంగా తొలుత ఒడిశాలోని మహానది నుంచి తెలంగాణ, ఏపీల్లోని గోదావరి, కృష్ణా నదుల మీదుగా తమిళనాడు, కర్ణాటకల పరిధిలోని కావేరి నది వరకు అనుసంధానించే ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. మహానదిలో సుమారు 360 టీఎంసీలు, గోదావరిలో 720 టీఎంసీల మిగులు జలాలున్నాయని పేర్కొంటూ.. వాటిని తర్వాతి నదీ బేసిన్లకు తరలించాలని నిర్ణయించింది. రాష్ట్ర పరిధిలో ఇచ్చంపల్లి (గోదావరి)-నాగార్జునసాగర్ (కృష్ణా), ఇచ్చంపల్లి-పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ప్రణాళిక వేసింది. ఇందులో ఇచ్చంపల్లి నుంచి సాగర్‌కు 580 టీఎంసీలు, పులిచింతలకు 130 టీఎంసీలు తరలించాలని నిర్ణయించింది. ఈ ప్రణాళికను కార్యరూపంలోకి తె చ్చేందుకు రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్న కేంద్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ప్రధానంగా మహానది, గోదావరి మిగులు జలాలపైనే చర్చించారు. రాష్ట్రం తరఫున ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఈఎన్‌సీ విజయ్‌ప్రకాశ్ పాల్గొన్నారు.

 వాటా వాడుకునేలా ప్రణాళికలు
 ఈ సందర్భంగా అదనపు జలాలపై తెలంగాణ మరోమారు తన అభ్యంతరాలను కమిటీ దృష్టికి తెచ్చింది. గోదావరిలో లభ్యంగా ఉన్న నీరు రాష్ట్ర అవసరాలకే సరిపోతుందని స్పష్టం చేసింది. ఎప్పుడో 30 ఏళ్ల కింద చేసిన అధ్యయనాన్ని పట్టుకుని గోదావరిలో మిగులు జలాలున్నాయనడం సరికాదని తెలిపింది. గోదావరిలో రాష్ట్రానికి ఉన్న వాటా 954.2 టీఎంసీల మేర తమ వద్ద ప్రాజెక్టుల నిర్మాణ ప్రణాళికలు ఉన్నాయని పేర్కొంది. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుల కింద 433.04 టీఎంసీలు వినియోగంలో ఉండగా, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులతో 475.79 టీఎంసీలు, చేపట్టనున్న ప్రాజెక్టులతో మరో 45.38 టీఎంసీలను వినియోగంలోకి తెచ్చేలా కార్యాచరణ ఉందని వివరించి.. ప్రాజెక్టుల వారీ ప్రణాళికలు అంజేసింది. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. ‘గోదావరిలో 720 టీ ఎంసీల మిగులు ఉందని చెప్పిన కేంద్రం... తర్వాత మళ్లీ అధ్యయనం చేసి 270 టీఎంసీల మిగులు మాత్రమే ఉందని తేల్చింది. రాష్ట్రం చేపడుతున్న కొత్త ప్రాజెక్టులను కూడా లెక్కలోకి తీసుకుంటే అసలు మిగులన్న మాటే లేదు. రాష్ట్ర వాటాను పూర్తిగా వాడుకున్నాక మరింత నీరు లభ్యతగా కనిపిస్తే దాన్ని నదుల అనుసంధానం ద్వారా తరలించేందుకు అభ్యంతరం లేదు..’ అని చెప్పారు.
 
 నీటిని తరలించే ఎత్తుపైనా అభ్యంతరాలు
 నది నీటిని ఎత్తిపోసేం దుకు నిర్ణయించిన ఎత్తుపైనా విద్యాసాగర్‌రావు అభ్యంతరాలు లేవనెత్తారు. ‘‘30ఏళ్ల కింద నిర్ణయించిన మేరకు నదీ ప్రాంతం నుంచి 120 మీటర్ల ఎత్తు వరకే నీటిని తరలించడానికి కేంద్రం అనుమతించింది. సాంకేతిక మార్పులు, భౌగోళిక పరిస్థితులలో వచ్చిన తేడాల వల్ల గరిష్టంగా 600 మీటర్ల ఎత్తు ఉండే ప్రాంతానికి సైతం ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించే అవసరం ఏర్పడింది. తెలంగాణలో ప్రణాళికా సంఘం దేవాదుల ఎత్తిపోతల పథకానికి 470 మీటర్ల ఎత్తుకు అనుమతిని ఇచ్చింది. చాలా రాష్ట్రాల్లో 350 నుంచి 400 మీటర్ల వరకు సైతం నీటిని ఎత్తిపోసే పథకాలున్నాయి. పాత విధానాన్ని మార్చాలని తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలు కోరుతున్నా దాన్ని కేంద్రం విస్మరించింది. ఇప్పటికైనా దాన్ని మార్చాలి..’ అని కోరారు.

మరిన్ని వార్తలు