అడ్రస్ అడిగి తెంచుకుపోయాడు!

24 Dec, 2015 23:51 IST|Sakshi
అడ్రస్ అడిగి తెంచుకుపోయాడు!

సిటీబ్యూరో: ఒక పల్సర్ బైక్... ఇద్దరు దొంగలు... 45 సెకన్ల సమయం..  సీన్ కట్ చేస్తే మూడు తులాల బంగారు గొలుసు స్నాచింగ్. లంగర్‌హౌస్ ఠాణా పరిధిలోని మొఘల్ కా నాలా ప్రాంతంలో బుధవారం జరిగిన చైన్ స్నాచింగ్ తీరు ఇది. ఈ ఘటన మొత్తం బాధితురాలి ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ ఫీడ్‌ను నగర పోలీసు అధికారిక వెబ్‌సైట్ ద్వారా గురువారం విడుదల చేసిన పోలీసులు నిందితుల ఆచూకీ తెలిస్తే వాట్సాప్ నెం:9490616555, లంగర్‌హౌస్ ఇన్‌స్పెక్టర్: 9490616124, ఎస్సై: 9490616461లకు సమాచారం ఇవ్వాలని కోరారు.    సీసీ కెమెరా ఫీడ్ ప్రకారం...
 
జ్యోతి ముందు నుంచే బైక్‌పై వెళ్లిన ఇద్దరు దుండగులు ఆమె ఇల్లు దాటిన తర్వాత ఆగారు. ఒకడు బైక్ పైనే ఉండగా... వెనుక కూర్చున్న వ్యక్తి దిగి జ్యోతి వైపు నడుచుకుంటూ వచ్చాడు.

జ్యోతి వెనుక నుంచి వేగంగా వచ్చాడు. ఆమె వెనక్కి తిరగడంతో ఆగి బైక్ వైపు రెండు అడుగులు వేసి మళ్లీ వెనక్కి తిరిగాడు.
 
జ్యోతికి సమీపంలోకి వచ్చి.. ఆమెను ఓ చిరునామా అడుగుతున్నట్లు నటించాడు.
 
సమాధానం చెప్పిన ఆమె ఇంటి గేటు వద్దకు వెళ్తుండగా... వెనుక నుంచి మెడలోని పుస్తెలతాడు లాగేశాడు. అప్పటికే ఇంజిన్ స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్న మరో దుండగుడు బైక్‌ను ముందుకు కదిలించగా... పరిగెత్తుకుంటూ వెళ్లి రెండోవాడు బైక్ ఎక్కాడు.     
 
జ్యోతి అరుస్తూ ఆ బైక్ వెంటపడింది. ఆమె అరుపులు విని ఇంట్లోంచి బయటకు వచ్చిన మరో యువకుడూ వెంబడించినా అప్పటికే స్నాచర్లు సందు దాటేశారు.  
 
దొంగలు 45 సెకన్ల కాలంలోనే ఈ ‘పని’ పూర్తి చేశారు. ఇదే సమయంలో నాలా వంతెనకు అవతలి వైపు హైదర్‌గుడలో జరిగిన మరో స్నాచింగ్ కూడా వీరి పనిగానే పోలీసులు అనుమానిస్తున్నారు.
 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు