-

పట్టణాల్లో పచ్చపచ్చగా..

8 Aug, 2017 02:03 IST|Sakshi
పట్టణాల్లో పచ్చపచ్చగా..
- అర్బన్‌ పార్కులను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం
రాష్ట్రవ్యాప్తంగా 80 పార్కులు.. హైదరాబాద్‌ పరిధిలో 14 ఏర్పాటు
ఇప్పటికే పూర్తయిన 12 పార్కులు, అభివృద్ధి దశలో మరో 24
 
సాక్షి, హైదరాబాద్‌: పట్టణాల్లో రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో, ప్రజలకు మెరుగైన జీవన విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రయత్నం చేస్తోంది. హైదరాబాద్‌తోపాటు అన్ని పట్టణ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే పార్కులను అటవీ శాఖ ఆధ్వర్యంలో తీర్చిదిద్దుతోంది. పట్టణాలకు దగ్గర్లో ఉండే అటవీ భూములను గుర్తించి వాటిలో కొంత భాగాన్ని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌ గతంలోనే ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్కుల అభివృద్ధికి అటవీ శాఖ కృషి చేస్తోంది. 
 
హైదరాబాద్‌ పరిధిలో 14 పార్కులు..: రాజధాని పరిధిలో ఔటర్‌కు లోపల, వెలుపల మొత్తం 14 ప్రాంతాలను అర్బన్‌ పార్కులుగా మార్చేందుకు అటవీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. గుర్రంగూడ, కండ్లకోయ, మేడ్చల్, దూలపల్లి, గాజుల రామారం తదితర ప్రాంతాల్లో ఉన్న అటవీ బ్లాకుల్లో పార్కుల అభివృద్ధి జరుగుతోంది. 14 ప్రాంతాల్లో మొత్తం 3,345 హెక్టార్ల అటవీ భూమిని పార్కుల అభివృద్ధికి గుర్తించారు. గుర్రంగూడ సంజీవని పార్క్, అజీజ్‌ నగర్‌ దగ్గర మృగవని నేషనల్‌ పార్క్, కండ్లకోయ నేచర్‌ పార్క్, శంషాబాద్‌ సమీపంలో డోమ్‌ నేర్‌ పార్క్, ఘట్‌ కేసర్‌ సమీపంలోని భాగ్య నగర్‌ సందనవనం పార్కులు ఇప్పటికే పూర్తయి పెద్ద సంఖ్యలో స్థానికులను, పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే అభివృద్ధి చేసిన పలు పార్కుల్లో కాటేజీలను కూడా అటవీ శాఖ ఏర్పాటు చేసింది. దీంతో ఎకో టూరిజానికి అవకాశాలు పెరిగాయి. 
 
ఒక్కో పార్కు.. ఒక్కో థీమ్‌తో..: ఒక్కో పార్కును ఒక్కో థీమ్‌తో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 80 అర్బన్‌ పార్కుల ఏర్పాటు లక్ష్యంగా పని చేస్తున్న అటవీ శాఖ.. ఇప్పటికే 24 పార్కులను అభివృద్ధి చేసేందుకు ఫారెస్ట్‌ బ్లాకులను గుర్తించింది. ఇందుకు రూ.25 కోట్ల నిధుల కేటాయింపు కూడా పూర్తి చేసింది. ప్రస్తుతం వీటి అభివృద్ధి వివిధ దశల్లో ఉంది. 12 పార్కులు ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 
 
అద్భుతంగా పని చేస్తున్న అటవీ శాఖ: కేటీఆర్‌
హైదరాబాద్‌ చుట్టూ అభివృద్ధి చేసిన పార్కులు, వాటి ప్రత్యేకతలను మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ట్వీటర్‌ ద్వారా వెల్లడించారు. మంత్రి జోగు రామన్న నేతృత్వంలో అటవీ శాఖ అద్భుతంగా పని చేస్తోందని కొనియాడారు. దీనిపై స్పందించిన మంత్రి  జోగు రామన్న, కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్‌ అభినందనలు అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి మరింత స్ఫూర్తిని కలిగించాయని, మిగతా పార్కులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలో 33 శాతం పచ్చదనం సాధనే లక్ష్యంగా అటవీ శాఖ పని చేస్తోందని తెలిపారు. 
మరిన్ని వార్తలు