'తప్పుడు సర్టిఫికెట్లతో విద్యార్థులు జాగ్రత్త'

10 Nov, 2016 21:07 IST|Sakshi
'తప్పుడు సర్టిఫికెట్లతో విద్యార్థులు జాగ్రత్త'

హైదరాబాద్: ఉన్నత చదువులకు అమెరికా వెళ్లే విద్యార్థులు తప్పుడు సర్టిఫికెట్లతో జాగ్రత్తగా ఉండాలని యూఎస్ కాన్సులేట్ అవినీతి నిరోధక అధికారి ఆడం ఫర్గుసన్ హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను ఉద్దేశించి గురువారం ఆయన ప్రసంగించారు. అమెరికా కల్పిస్తోన్న ఉన్నత విద్యావకాశాలను వినియోగించుకొనేందుకు విద్యార్థులు సన్నద్ధం కావాలన్నారు.

ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు అందుకు కావాల్సిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలని, అదే సందర్భంలో తప్పుడు సర్టిఫికెట్లను నివేదించడం వారి భవిష్యత్తుకి ప్రమాదకరమని చెప్పారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ నేతృత్వంలో భారతీయ విద్యార్థుల పట్ల ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు. తప్పుడు సర్టిఫికెట్ల పట్ల యుఎస్ అనుసరిస్తున్న అవినీతి నిరోధక విధానాలను ఫర్గుసన్ విద్యార్థులకు వివరించారు.

మరిన్ని వార్తలు