పోలీసుల సంగతి చూస్తాం: వీహెచ్‌

23 Mar, 2017 14:29 IST|Sakshi
హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దానకర్ణుడిలా దానధర్మాలు చేస్తుంటే.. ఆయన కుమారుడు కేటీఆర్‌ మాత్రం ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్నారు. ఇంటి పన్నును రెట్టింపు చేశారు. గతంలో రూ. 800 ఉన్న ఇంటి పన్ను ఇప్పుడు రూ. 1600లకు పెంచారు. గుళ్లు గోపురాలకు, కుల సంఘాలకు కోట్లకు కోట్లు దానం చేస్తున్న సీఎం.. పన్నులు ఎందుకు పెంచుతున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. ‘‘ఉద్యమ నాయకుడని చెప్పుకునే కేసీఆర్‌ ధర్నా చౌక్‌ ఎత్తేస్తారా.. ఇదేమన్నా నియంత రాజ్యమా? ఉద్యమాలు వస్తాయని కేసీఆర్‌ భయపడుతున్నారు.
 
అందుకే ధర్నా చౌక్‌ ఎత్తేస్తున్నారని మండిపడ్డారు. అంతకు ముందు అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడటానికి వచ్చిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. సభ నడుస్తున్న సమయంలో మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు అనుమతి లేదని పోలీసులు ఆయనను అడ్డుకోవడంతో.. వీహెచ్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మాజీ మంత్రిగా మాట్లాడితే తప్పేంటి?.. పోలీసుల వ్యవహారం బాగోలేదు. డీజీపీ పోలీసు రాజ్యం చేస్తున్నారు. ప్రభుత్వమే మందు అమ్మిస్తోంది. తాగి బయటకు వస్తే పోలీసులు పట్టుకుంటున్నారు. మా ప్రభుత్వం వచ్చాక పోలీసుల సంగతి చూస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
మరిన్ని వార్తలు