6 నెలలు.. రూ.18 వేల కోట్లు!

12 Jan, 2018 01:46 IST|Sakshi

గతేడాదితో పోలిస్తే పన్ను రాబడిలో 10 శాతం వృద్ధి

కేంద్ర, రాష్ట్ర జీఎస్టీల కింద వచ్చింది రూ.8వేల కోట్లు

వ్యాట్‌ ఆదాయం 10వేల కోట్ల పైమాటే

కేంద్రం ఇచ్చిన పరిహారం మాత్రం రూ.338 కోట్లే..

సాక్షి, హైదరాబాద్‌: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన ఆరు మాసాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల శాఖ ద్వారా రూ.18వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. గత జూలై నుంచి డిసెంబర్‌ వరకు పన్నుల శాఖ గణాంకాల ప్రకారం మొత్తం రూ.18,081.25 కోట్లు ఖజానాకు చేరాయి.

గతేడాది (2016–2017 ఆర్థిక సంవత్సరం) తో పోలిస్తే ఈ ఆరు నెలల్లో 10 శాతం వరకు పన్ను రాబడిలో వృద్ధి నమోదైంది. అయితే, జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పన్నుల ఆదాయం తగ్గిపోతుందనే అనుమానాలు పటాపంచలయ్యాయి. కేంద్రం నుంచి ఆశించిన మేర పరిహారం రాకపోయినా.. పన్నుల ద్వారా ఆదాయం పెరగడం పట్ల ఆ శాఖ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.  


జీఎస్టీ లెక్క రూ.8వేల కోట్ల వరకు..
వాస్తవానికి మద్యం, పెట్రోలు తప్ప మిగిలిన అన్ని రకాల వస్తువులపై జీఎస్టీ అమలవుతోంది. అయితే, పెట్రోల్‌ పన్నును కూడా వ్యాట్‌ కింద పన్నుల శాఖే వసూలు చేసి నమోదు చేస్తుంది. మద్యం ఆదాయాన్ని మాత్రం ఎక్సైజ్‌ శాఖ పర్యవేక్షిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌ ఆదాయాన్ని మినహాయించి పన్నుల శాఖ వసూలు చేసింది ఈ ఆరు నెలల్లో 18 వేల కోట్ల రూపాయలపైనే ఉండటం గమనార్హం. ఇందులో రూ.10 వేల కోట్ల వరకు పెట్రో, ఇతర వ్యాట్‌ వర్తింపు వస్తువుల నుంచి వసూలైంది.

కాగా, జీఎస్టీ పేరుతో రూ.8వేల కోట్ల వరకు వచ్చాయి. ఇందులో కూడా రాష్ట్ర జీఎస్టీ కింద రూ.3,969 కోట్లు, ఐజీఎస్టీ (వస్తు వినియోగ పన్ను) కింద రూ.3,438 కోట్లు వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. దీనికి తోడు కేంద్రం నుంచి మూడు దఫాల్లో ఇప్పటివరకు రూ.338 కోట్లు పరిహారం కింద వచ్చింది. అయితే, రాష్ట్ర జీఎస్టీ జూలై నుంచి ప్రతి నెలా తగ్గుతుండగా, ఐజీఎస్టీలో ప్రతి నెలా వృద్ధి కనిపిస్తుండడం గమనార్హం.

గతేడాది రూ.16,220 కోట్లే..
గతేడాదితో పోలిస్తే జీఎస్టీ అమలు చేసిన ఈ ఏడాది పన్నుల శాఖ ఆదాయంలో పెరుగుదల కనిపిస్తోంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో జూలై నుంచి డిసెంబర్‌ వరకు రూ.16,220 కోట్లు ఆదాయం రాగా, ఈ సారి అది రూ.18వేల కోట్లకు చేరింది. అంటే గతేడాది కంటే 10 శాతం వృద్ధి నమోదైంది. మరో విశేషమేమిటంటే జీఎస్టీ అమల్లోకి వచ్చిన 2017 జూలైలో అత్యధికంగా రూ.3,251 కోట్ల పన్నులు వసూలయ్యాయి.


గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పన్నుల శాఖ ఆదాయ వివరాలు
నెల             2016–17        2017–18
                                     (రూ.కోట్లలో)

జూలై            2,292.1    3,251.38
ఆగస్టు        2,799.56    2,675.21
సెప్టెంబర్‌     2,815.44    2,976.59
అక్టోబర్‌       2,756.79    3,125.18
నవంబర్‌       2,880.8    3,075.93
డిసెంబర్‌     2,675.54    2,976.96
మొత్తం     16,220.23    18,081.25

మరిన్ని వార్తలు