ప్రభుత్వ స్కూళ్లలో వేద గణితం

12 Jul, 2016 06:30 IST|Sakshi
ప్రభుత్వ స్కూళ్లలో వేద గణితం

- డిజిటల్ తరగతులు,ఆన్‌లైన్ పాఠాలతో బోధన
- వినూత్న సంస్కరణల బాటలో పాఠశాల విద్యాశాఖ
 - త్వరలోనే ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం కడియం
 
 సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు పాఠశాల విద్యాశాఖ సంస్కరణల బాట పట్టింది. పలు వినూత్న విద్యా కార్యక్రమాల అమలుకు కార్యాచరణ రూపొందించింది. డిజిటల్ తరగతులు, ఆన్‌లైన్ పాఠాలు, వేద గణితం మెళకువలు, మార్షల్ ఆర్ట్స్, యోగా, స్పోర్ట్స్, గేమ్స్ వంటి వాటిని అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ అంశాల్లో టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు పాఠశాల విద్య డెరైక్టర్ కిషన్ వెల్లడించారు. అందులో కొన్నింటిని ఇప్పటికిప్పుడే అమల్లోకి తేనున్నామని... మరి కొన్నింటిని దశల వారీగా అమల్లోకి తెస్తామని చెప్పారు. పాఠశాల విద్యలో తీసుకురాబోతున్న వివిధ మార్పులు, సంస్కరణలను ఆయన వెల్లడించారు.

 3,700 పాఠశాలల్లో అమలు
 వంద మందికిపైగా విద్యార్థులున్న దాదాపు 3,700 ఉన్నత పాఠశాలల్లో వేద గణితం మెళకువలు, మార్షల్ ఆర్ట్స్, యోగా, స్పోర్ట్స్ వం టివి తప్పనిసరిగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేక పద్ధతులు, మెళకువలు కలిగిన వేద గణితంలోని అంశాల ఆధారంగా గణితం బోధన చేపడతారు. తద్వారా విద్యార్థులకు సులభంగా అర్థంకావడంతో పాటు విద్యార్థులు కూడా బోధనలో పాలు పంచుకునేలా చేస్తారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటికే వందేమాతరం ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీచర్లకు, విద్యా వలంటీర్లకు శిక్షణ ఇస్తారు.

ప్రస్తుతం నియమిస్తున్న 9,335 మంది విద్యా వలంటీర్లు ఈ నెల 16వ తేదీ నుంచి బోధన ప్రారంభించాల్సి ఉంది. కానీ తాజా నిర్ణయం నేపథ్యంలో వారంతా శిక్షణ తరువాతే బోధన ప్రారంభిస్తారు. ఇక ప్రతి జిల్లాలో 20 మందిని మాస్టర్ ట్రైనర్లుగా ఎంపిక చేసి.. ఈ వారంలో లేదా వచ్చే వారంలో శిక్షణ ఇస్తారు. తరువాత వారి ఆధ్వర్యంలో జిల్లాల్లోని మిగతా టీచర్లకు శిక్షణ ఇస్తారు. బోధనలోనే కాదు యోగా వంటి అంశాల్లోనూ ఈ శిక్షణ ఉంటుంది. అలాగే ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్లను విద్యా వలంటీర్లుగా తీసుకుంటున్న నేపథ్యంలో వారికి, పీఈటీలకు కూడా యోగా, మార్షల్ ఆర్ట్స్ వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చి పాఠశాలల్లో అమలు చేస్తారు. ప్రతి ఉన్నత పాఠశాలలో స్పోర్ట్స్, గేమ్స్ తప్పనిసరి చేస్తారు. రెండు ఇండోర్ గేమ్స్, ఆటస్థలాలున్న చోట రెండు ఔట్‌డోర్ గేమ్స్ తప్పనిసరిగా అమలు చేస్తారు.

 విద్యార్థులకు హెల్త్ రికార్డులు
 పాఠశాలల్లో విద్యార్థులకు పక్కాగా హెల్త్ చెకప్‌తోపాటు హెల్త్ రికార్డులు రూపొందిస్తారు. వీటిని ఆన్‌లైన్‌లోనూ నమోదు చేస్తారు. ఈసారి యూనిఫారాల ధరలు 25 శాతం మేర తగ్గనున్నాయి. పవర్ లూమ్స్ ఆధ్వర్యంలో వస్త్రం తయారు చేసి, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పాఠశాల యూనిట్‌గా కుట్టించి అందించేందుకు చర్యలు చేపడుతున్నందున ధరలు తగ్గుతాయని చెబుతున్నారు. దీనివల్ల యూని ఫారాలు అందించే క్రమంలో కిందిస్థాయి సిబ్బంది ఆగడాలకు అడ్డుకట్ట పడనుంది.
 
 డిజిటల్ తరగతులు, డిజిటల్ లెర్నింగ్
 పాఠశాలల్లో డిజిటల్ ఆధారిత శిక్షణను ప్రారంభించనున్నారు. ఇప్పటికే 70 శాతం ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్‌కు అవసరమైన ప్రొజెక్టర్లు ఉన్నాయి. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాష్ట్రానికి తిరిగి రాగానే వాటిని ప్రారంభిస్తారు. ఈ లెర్నింగ్ కోసం 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంటరాక్టివ్ మాడ్యూల్స్‌ను సిద్ధం చేశారు. వీలైన చోట ఆన్‌లైన్‌లో అంశాల ఆధారంగా పాఠ్యాంశాల బోధన చేపడతారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ ఆధ ్వర్యంలో 250 స్కూళ్లలో, ఐటీ శాఖ ఆధ్వర్యంలో 500 స్కూళ్లలో మొదట దీనిని అమలు చేస్తారు. తరువాత మిగతా పాఠశాలలకు విస్తరిస్తారు. ఇక ప్రైమరీ, ప్రీపైమరీ విద్యార్థుల కోసం యూనిసెఫ్ ఆధ్వర్యంలో టాకింగ్ బుక్స్‌ను సిద్ధం చేశారు. ఇందులో ఏదైనా బొమ్మ, పదంపై దానికి సంబంధించిన పెన్ను పెట్టగానే అదేమిటన్నది ధ్వని రూపంలో వస్తుంది. దీనిని 6నెలల్లోగా అమల్లోకి తెస్తారు. ప్రీప్రైమరీ ఇంగ్లిష్ మీడియం టీచర్లకు ఈ నెలాఖరులో బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బోధనలో శిక్షణ ఇస్తారు.

మరిన్ని వార్తలు