పేరు.. వీణావాణీ.. అడ్రస్‌.. స్టేట్‌హోం

2 Jan, 2017 04:24 IST|Sakshi
పేరు.. వీణావాణీ.. అడ్రస్‌.. స్టేట్‌హోం

నిలోఫర్‌తో వీడిన పదేళ్ల అనుబంధం
- స్టేట్‌హోంకు తరలింపు..ముగ్గురు ఆయాలు, టీచర్‌ కూడా

సాక్షి, హైదరాబాద్‌: అవిభక్త కవలలు వీణావాణీలను హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రి నుంచి అమీర్‌పేట్‌ స్టేట్‌హోంకు రాష్ట్ర ప్రభుత్వం తరలించింది. ఆదివారం ఉదయం ప్రత్యేక అంబులెన్స్‌లో వారితోపాటు ముగ్గురు ఆయాలు, టీచర్‌ను కూడా పంపింది. స్టేట్‌హోంలోని వాతావరణానికి అలవాటు పడే వరకు(ఆరు మాసాలు) వారి బాగోగులు వీరే చూసుకోనున్నారు. అనివార్యమని భావిస్తే నిలోఫర్‌ ఆస్పత్రి వైద్యులే  స్టేట్‌హోంకు వెళ్లి వైద్య సేవలు అందించనున్నారు. సుమారు పదేళ్ల పాటు నిలోఫర్‌ ఆస్పత్రి వైద్యులు, ఆయాలే వీరి బాగోగులను చూసుకున్నారు. వీణావాణీల కోసం ఓ గదితోపాటు ముగ్గురు ఆయాలు, చదువు చెప్పేందుకు ఒక టీచర్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం వీణావాణీలు ఆరో తరగతి చదువుతున్నారు. ఆస్పత్రిని వీడి వెళ్లేందుకు చిన్నారులు తొలుత నిరాకరించారు. వైద్యులు వారికి నచ్చజెప్పడంతో అయిష్టంగానే వెళ్లేందుకు అంగీకరించారు. పిల్లలిద్దరిలో వాణి హైపర్‌టెన్షన్‌తో బాధపడుతోంది.

మాకు సమాచారం లేదు..
దంతాలపల్లి: అవిభక్త కవలలైన వీణావాణీలను నిలోఫర్‌ ఆస్పత్రి నుంచి ప్రభుత్వం స్టేట్‌హోంకు తరలించిన విషయంలో తమకు ఎలాంటి సమాచారం లేదని వారి తల్లిదండ్రులు మురళి, నాగలక్ష్మిలు పేర్కొన్నారు. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఉదయం టీవీలో చూసి విషయం తెలుసుకున్న తాము ఆస్పత్రికి ఫోన్‌ చేస్తే ‘స్విచాఫ్‌’అని వచ్చిందని వీణావాణీల తండ్రి మురళి పేర్కొన్నారు. పిల్లలను ఆస్పత్రిలోనే ఉంచి శస్త్రచికిత్స చేయాలని తాము లేఖ ఇచ్చినా ఎలాంటి సమాచారం లేకుండా స్టేట్‌ హోంకు తరలించడమేమిటని వారు ప్రశ్నించారు.

ఇది వీణావాణి..   
జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలని చెబుతూ.. తమ చిత్రాన్ని తామే గీసుకున్న వీణావాణీ..


 

మరిన్ని వార్తలు